ఇండస్ఇండ్ బ్యాంక్ చేతికి ఐఎస్ఎస్ఎల్
వంద శాతం వాటా కొనుగోలు
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్)కు చెందిన సెక్యూరిటీస్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్(ఐఎస్ఎస్ఎల్)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్ ఇండ్ తెలియజేసింది. తాము ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నామని, 500కు పైగా బ్రోకర్లకు సేవలందిస్తున్నామని ఐఎస్ఎస్ఎల్ కొనుగోలుతో తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని ఇండస్ఇండ్ ఎండీ, సీఈఓ రొమేశ్ సోబ్తి చెప్పారు.
3 నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందన్నారు. 2007లో ప్రారంభమైన ఐఎస్ఎస్ఎల్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్ క్లియరింగ్, డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీస్లను నిర్వహిస్తోంది. రిటైల్, సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లతో పాటు వెయ్యికి పైగా బ్రోకర్లకు సేవలందిస్తోంది. రోజుకు పది లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది.