మారిన జిల్లాల పేర్లపై ఉత్తర్వులు
తప్పుగా పేర్కొన్న మండలాలు, గ్రామాల పేర్ల సవరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన అనంతరం జారీ చేసిన తుది నోటిఫికేషన్లో గల్లంతైన మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల వివరాలను జత చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుది ప్రకటనలో పేర్కొన్న కొన్ని జిల్లాల పేర్లను ప్రభుత్వం తర్వాత సవరించింది. ఈ పేర్లను మరోసారి వెల్లడిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. దీంతోపాటు అప్పట్లో తప్పుగా పేర్కొన్న మండలాలు, గ్రామాల పేర్లను సవరించింది. తొలుత కొమురం భీం జిల్లాగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ... కుమురంభీం జిల్లాగా మార్చారు. జోగులాంబ జిల్లాను జోగులాంబ గద్వాల జిల్లాగా సవరించారు. యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా మార్చారు. భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మార్చారు. రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి తుది నోటిఫికేషన్లో కొండపాక, మిర్దొడ్డి, తొగుట మండలాల పేర్లను విస్మరించారు.
ఇప్పుడా మూడు మండలాలను, వాటి గ్రామాల్లోని పేర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొండపాక మండలంలో అంకిరెడ్డిపల్లి, కొండ పాక, కోనాయపల్లి, కుకునూరుపల్లి, గిరాయిపల్లి, జప్తి నాచారం, తిప్పారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, బందారం, మంగోల్, మత్పల్లి, మేదినీపూర్, మర్పడగ, ముద్దాపూర్, ఎర్రవల్లి, లకుడారం, వెలికట్ట, విశ్వనాధపల్లి, సింగారం, సిరిసినగండ్ల గ్రామాలను సిద్దిపేట జిల్లాలో చేర్చారు. మిర్దొడ్డి మండలానికి సంబంధించి ధర్మారం, కొండాపూర్, మిర్దొడ్డి, కాసులాబాద్, మోతె, అల్వాల్, మల్లుపల్లి, చేప్యాల్, అందె, లింగుపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్, భూంపల్లి, కూడవెల్లి తదితర గ్రామాలను చేర్చారు. తొగుట మండలంలో ఘనాపూర్, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్‌పల్లి, తుక్కాపురం, కనగల్, గుడికందుల, లింగంపేట, తొగుట, చందాపూర్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తి లింగారెడ్డిపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలను చేర్చారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాలను మండలాల పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటిదాకా గట్టు మండల పరిధిలో ఉన్న అప్కొండనహళ్లిని కె.టి.దొడ్డి మండలంలోకి, ముస్లింపల్లిని గట్టు మండలంలో చేర్చారు. శాలీపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవెల్లి మండలంలోకి, మంగంపేట, రాయిమాకులకుంట, పోసాలపాడు గ్రామాలను మనోపాడు మండలంలోకి మార్చారు. వనపర్తి జిల్లాకు సంబంధించి ఘర్కాస, అనపహాడు గ్రామాలను ఘన్పూర్ మండలంలోకి, లింగసానిపల్లి గ్రామాన్ని చిన్నంబావి మండలంలోకి మార్చారు. గుంపనపల్లి గ్రామాన్ని శ్రీరంగాపూర్ మండలంలోకి మార్చారు. రామేశ్వరపురం గ్రామాన్ని పెబ్బేరులోకి, అమరావతినగర్‌ను మదనపూర్ మండలంలోకి, రంగాపూర్ గ్రామా న్ని అమరచింత, ఏదుల గ్రామాన్ని గోపాలపేట గ్రామంలోకి మార్చారు.