ఇస్తాంబుల్ ఉగ్రదాడి: భారతీయులు సురక్షితం
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యగా భావిస్తోన్న ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు పేలుళ్లలో భారతీయులు ఎవరికీ ఏమీ కాలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. టర్కీ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 36 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో భారతీయులు ఎవరూలేరని విదేశీ వ్యవహారాల శాఖ సైతం నిర్ధారించింది.
ఇస్తాంబుల్ లోని భారత్ దౌత్యకార్యాలయం ఎప్పటికప్పుడు స్థానిక ప్రభుత్వం వద్ద నుంచి సమాచారం తెప్పించుకుంటున్నదని, సహాయం అవసరమైన భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లు ఏర్పాటుచేశామని అధికారులు పేర్కొన్నారు. ఇస్తాంబుల్ దాడి ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.