ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్‌లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు.
అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు.