బాబు సిబ్బందిలో తెలంగాణ పోలీసుల బదిలీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్గత సిబ్బందిని మారుస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి చెందిన మొత్తం 40 మంది తెలంగాణ పోలీసు సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఏసీబీ కోర్టుకు అందిన కొన్ని గంటల్లోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అంతకుముందు ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఆడియో టేపులు అసలైనవేనని, వాటిలో ఎలాంటి ఎడిటింగ్ చేయలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దీంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుగా సీఎం నివాసం వద్ద భద్రతా ఇబ్బంది మొత్తాన్ని మార్చి వేశారు. ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అలాగే గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సమూల మార్పులు చేసుకుంటూ వచ్చారు. తెలంగాణలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామని ఇటీవలే బాబు వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ మార్పులు జరిగాయా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.