పైసా చార్జీ లేదు, టీ వ్యాలెట్ ప్రత్యేకతలివే!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వ్యాలెట్’ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్‌లో గురువారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ డిజిటల్ వ్యాలెట్‌ను ప్రారంభించారు. నగదు రహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ వ్యాలెట్ ద్వారా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులు జరుపుకోవచ్చు. ఫోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది.
ఈ వ్యాలెట్ ప్రత్యేకతలు ఇవే..
ఆధార్ ప్లస్ బయో మెట్రిక్, ఆధార్ ప్లస్ మొబైల్ OTP ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఆసరా, ఉపాధి హామీ పథకాల ద్వారా వచ్చే నగదును నేరుగా యాప్ ద్వారా పొందొచ్చు.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో టీ వ్యాలెట్ యాప్ రూపొందింది.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే యాప్ ఉపయోగించుకోవచ్చు.
మీ సేవ ద్వారా వ్యాలెట్ లో డబ్బు వేసుకోవచ్చు.
యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితం
T వ్యాలెట్ అన్ని ప్రభుత్వ చెల్లింపులను చేసుకోవచ్చు. కరెంట్, వాటర్, జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను, డీటీహెచ్, ల్యాండ్ లైన్, మొబైల్ రీఛార్జి, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించుకోవచ్చు.
ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించుకోవచ్చు.
నగదును ఎలాంటి ఛార్జీ లేకుండా ఇతరులకు పంపించుకోవచ్చు.