ఆరియన్‌ప్రొ జూమ్- అదానీ గ్రీన్ రికార్డ్
కొద్ది రోజులుగా నిరంతర ర్యాలీ చేస్తున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడం ప్రభావం చూపుతోంది. ఇక మరోవైపు సింగపూర్ బ్యాంకింగ్ సంస్థ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో టెక్నాలజీ ప్రొడక్టుల కంపెనీ ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం..
అదానీ గ్రీన్ ఎనర్జీ
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 51 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 131 కోట్ల ఇబిట్ నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 30 శాతం ఎగసి రూ. 878 కోట్లను తాకింది. కాగా.. సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ ఇటీవల నిరవధికంగా లాభపడుతూ వస్తున్న విషయం విదితమే. ఈ బాటలో మరోసారి అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 639 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) దాదాపు రూ. లక్ష కోట్లకు చేరింది. వెరసి బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలను విలువరీత్యా వెనక్కి నెట్టింది. గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 1,173 శాతం దూసుకెళ్లడం విశేషం!
ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్
అనుబంధ సంస్థ ఇంటెగ్రో టెక్నాలజీస్ ద్వారా సింగపూర్‌లోని అతిపెద్ద బ్యాంకు నుంచి ఐటీ ప్రొడక్టుల సేవల కోసం ఆర్డర్‌ను పొందినట్లు ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ పేర్కొంది. ఆర్డర్లో భాగంగా స్మార్ట్ లెండర్ ప్రొడక్ట్ వెర్షన్4 ద్వారా సింగపూర్ బ్యాంక్ బ్రాంచీలు, అనుబంధ సంస్థలకు సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం లభించిన ఈ ఆర్డర్ విలువను 5.5 మిలియన్ డాలర్లుగా ఆరియన్‌ప్రొ తెలియజేసింది. 2022 ఫిబ్రవరిలోగా ప్రాజెక్టును అభివృద్ధి చేయవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరియన్‌ప్రొ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 61.4 వద్ద ఫ్రీజయ్యింది.