'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి'
తిరువనంతపురం: కేరళ హోమంత్రి రమేశ్ చెన్నితాలా ప్రభుత్వాధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనవసరంగా మీడియాకు సమాచారం అందించినా, తప్పుడు వివరాలు తెలియజేసినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హుకుం జారీ చేశారు. కేరళలోని ఓ ఐటీ ప్రాజెక్టు విషయంలో దాదాపు రూ.రెండు కోట్లు వృధా చేశారనే విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
దీనిపై మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగింది. ఓ సీనియర్ పోలీసు అధికారి ఐటీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మీడియాకు లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు విషయాలు మీడియాకు అప్పుడే చెప్పవద్దని హెచ్చరించారు.