27 నుంచి ప్రజా సాధికార సర్వే
ప్రతి ఇంటికీ కొత్త నంబర్లు : ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రజల నుంచి సమాచారం సేకరించడంతో పాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ కార్యదర్శి పి.ప్రద్యుమ్న తెలిపారు. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ ట్యాబ్ ద్వారా ఫొటో తీసి, దాన్ని జియోట్యాగ్ చేసి కొత్త నంబరును వెంటనే కేటాయిస్తామన్నారు. సర్వేలో పాల్గొనే మాస్టర్ ట్రైనర్స్కు గురువారం విజయవాడలో ఒక రోజు శిక్షణ నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన 2,500 మంది ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారుల్లో చాలామందికి ఆధార్ లేదని, వీరందరికీ సర్వేలో ఆధార్ నంబర్ ఇస్తామన్నారు. ఆధార్ కార్డులో సమాచార లోపాన్ని సరిదిద్దడం, మొబైల్ నంబరును అనుసంధానించడం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27న ఈ సర్వే ప్రారంభిస్తారని, సుమారు 40 రోజులు కొనసాగుతుందని ప్రద్యుమ్న తెలిపారు. విదేశాలు, పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ర్ట పౌరులందరూ ఈ సర్వేలో పాల్గొనవచ్చన్నారు.