గుర్తింపు పంచాయితీ!
ఐటీఏడీఏ అధికారుల నిర్లక్ష్యం.. కొండంత అలసత్వం..గిరిజనుల పాలిట శాపమై కూర్చుకుంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాలు తప్పుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు దరిచేరే మార్గం కనిపించకుండా పోయింది. ఏజెన్సీ గ్రామపంచాయతీల గుర్తింపు వివాదమైంది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కుల కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. ఇదేమి అన్యామంటూ ప్రశ్నిస్తున్నారు.
అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాం తంలోని ఏజెన్సీ గ్రామాలపై ఐటీడీఏ అధికారులకు స్పష్టత కొరవడింది. నాలుగు గ్రామ పం చాయతీలను ఈ జాబితా నుంచి తొలగించడం పై ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ధ్రువీకరణ ప్రకారం ఏజెన్సీ గ్రా మ పంచాయతీలకు సంబంధించిన వివరాలను తమకు పంపించాలని ఈ ఏడాది ఆరంభంలో గిరిజన సంక్షేమశాఖ కమిషన్ కోరింది. దీనిపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు 27 గ్రామ పంచాయతీల పరిధిలో 68 గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించి పంపించారు. ఇందులో లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అప్పాపూర్ చెంచుపెంట అనుబంధగా గ్రామంగా ఉంది. అయితే అప్పాపూర్ను గ్రామపంచాయతీగా గుర్తించి దీని కింద 20 చెంచుపెంటలను చేర్చారు. అప్పాపూర్ను పంచాయతీ నుంచి తొలగిస్తే 26 గ్రామ పంచాయతీలను ఐటీడీఏ గుర్తించిన జాబితాగా పరిగణంలోకి తీసుకోవచ్చు. ఇది వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 30 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ కింద ఉండేవి. ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలను ఏజెన్సీ జాబితా నుంచి తొలగించారు. బల్మూర్ మండలం లక్ష్మిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బిల్లకల్లును ఏజెన్సీగా గుర్తించి పంచాయతీ హెడ్క్వార్టరును విస్మరించారు.
రాజ్యాంగంలో ఇలా..
ఏజెన్సీ యాక్టు (12-07-1950లో వచ్చింది) ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్డ్‌లో ఆర్టికల్ 244లో తొమ్మిది జిల్లాలో 107 మండలాల పరిధిలో 5948 గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించారు. అందులో మహబూబ్ నగర్ జిల్లాలోని నోటిఫైడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలుగా అమ్రాబాద్ మండలంలో తుర్కపల్లి పంచాయతీ మినహా 17 , లింగాల మండలంలోని నాలుగు, అచ్చంపేటమండలంలో ఆరు, బల్మూర్ మండలంలో నాలుగు పంచాయతీలు ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించారు.
నిబంధనలు ఇవి...
ఏజెన్సీ పంచాయతీల విస్తరణ (పీసా) నిబంధనలు ప్రకారం ఇచ్చిందా? లేదంటే భారత రాజ్యాంగం ప్రకటించిన జాబితా ఇచ్చారా అన్నది స్పష్టత లేదు. ఐటీడీఏకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించే అధికారం ఉందా...! ఉంటే ఏజెన్సీ గిరిజనేతరుల హక్కుల పోరాట సమితి 513 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఈప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు.
పొంతన లేని సమాచారం గిరిజన సంక్షేమశాఖకు అందించడంతో ఏజెన్సీ వాసులు అయోమయానికి గురువుతున్నారు. కనీస అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాలను ఏజెన్సీలుగా గుర్తిం చాల్సి ఉన్నా పాలకులకు అవేమీ పట్టడం లేదు. కొందరి స్వార్థం కోసం వసతులు, సౌకర్యాలు ఉన్నా.. వాటిని ఏజెన్సీలుగా ఎంపిక చేశారు. నే తల మాటలు నమ్మిన అధికారులు మారుమూల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలను విస్మరించారు. ప్రస్తుతం ఇది ఉద్యోగులకు వరం కాగా చెంచు గిరిజనులకు కీడు చేస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏజెన్సీ గ్రామాలకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నా నిధులు..గిరిజనులకు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ గ్రామ పంచాయతీల గుర్తింపు విమర్శలకు తావిస్తోంది.
ఎన్నికలు ఎలా నిర్వహించారు...
ఈ ఏడాది జూన్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అచ్చంపేట మండలంలోని 7, బల్మూర్ మండలలో 4, అమ్రాబాద్ మండలలో 17, లింగాల మండలంలో రెండు చొప్పున మొత్తం 30 గ్రామపంచాయతీలను షెడ్యూల్డు ఏరియా కింద ఎస్టీలకు రిజర్వేషన్ కలిపించి ఎన్నికలు నిర్వహించారు. ఐటీడీఏ మాత్రం అచ్చంపేట మండలం దేవులతండా, అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, కల్మలోనిపల్లి, బల్మూర్ మండలం లక్ష్మిపల్లి గ్రామపంచాయతీలను ఏజెన్సీ జాబితా నుంచి తొలగించింది. ఇది ఎక్కడి న్యాయమని విద్యావంతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.