ఐఐటీ విద్యార్థుల అరెస్టు.. వేధింపులు
న్యూఢిల్లీ: ఇంటర్న్ షిప్ కోసం ఇటలీ వెళ్లిన ముగ్గురు భారతీయ విద్యార్థులపై ఆ దేశ పోలీసులు జాతివివక్షను చూపారు. సినిమాల్లోలా అకారణంగా అదుపులోకి తీసుకుని అక్కడికీ, ఇక్కడికీ తిప్పుతూ విద్యార్థులను వేధించిన ఇటాలియన్ అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ ఐఐటీ విద్యార్థులైన అక్షిత్ గోయల్, దీపక్ భట్, బాంబే ఐఐటీ స్టూడెంట్ అయిన ఉదయ్ కుసుపాటిలు ఇంటర్న్ షిప్ కోసం గత వారం ఇటలీలోని వెనటిమిగ్లియా నగరానికి వెళ్లారు. అక్కడ మెట్రో స్టేషన్ లో రైలు దిగుతున్న ఈ ముగ్గురిని దాదాపు 30 మంది పోలీసులు, పాస్ పోర్ట్ అధికారులు చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు. తాము ఇంటర్న్ షిప్ కోసం వచ్చినట్లు అన్నిరకాల ఆధారాలు, సంబంధిత పేపర్లు చూపినప్పటికీ సంతృప్తి చెందని పోలీసులు.. ఐఐటీయన్లను అదుపులోకి తీసుకుని వెనటిమిగ్లియా నుంచి 850 కిలోమీటర్ల దూరంలోని బెయి నగరంలోని ఓ పోలీస్ క్యాంప్ వద్దకు తరలించారు. అక్కడ పాకిస్థానీ, ఇతర ఆఫ్రికన్ జాతీయులతో కలిపి తమను విచారించారని, భారత ఎంబసీతోగానీ, గైడ్ ఫ్రొఫెసర్, కుటుంబసభ్యులతోగానీ మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని విద్యార్థులు చెబుతున్నారు.
వెలుగులోకి వచ్చిందిలా..
అక్షిత్, దీపక్, ఉదయ్ ల నుంచి 24 గంటలు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు ఇటలీలోని భారతీయ రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎంబసీ అధికారులు ఆ ముగ్గురి జాడ కనిపెట్టడంతో పాటు, పోలీసుల అదుపులో ఉన్న వారిని విడిపించేదుకు ప్రయత్నించారు. అసలేం జరిగిందో, తమను ఇటలీ పోలీసులు అకారణంగా ఎలా అరెస్ట్ చేశారో, ఎక్కడెక్కడికి తిప్పారో అన్ని విషయాలను వివరిస్తూ ముగ్గురు విద్యార్థులు కలిసి లేఖను రాశారు. ప్రస్తుతం అక్షిత్, దీపక్, ఉదయ్ లను రోమ్ తరలించినట్లు సమాచారం. మరికొద్ది గంటల్లోనే వారు విడుదలవుతారని ఎంబసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఉదంతంపై ఇటలీ అధికారులు పెదవి విప్పడంలేదు. తాము జాతివివక్ష చూపలేదని మాత్రం అంటున్నారు.