ప్రకృతి అందాలకు పర్యాటక సొబగులు
జి.మాడుగుల : ఆహ్లాదకర వాతావరణం .. చుట్టూ పచ్చదనం.. కొండలపై నుంచి జలజలా జాలువారే నీటితో అలరారే కొత్తపల్లి జలపాతం సోయగం వర్ణనాతీతం. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఈ జలపాతాన్ని చూసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపుతారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ‘వనబంధు కల్యాణయోజన’ పథకం కింద నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సందర్శకుల సౌలభ్యం కోసం సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవలే గెడ్డపై రెండుచోట్ల ఇనుప వంతెనలు, కొండవాలు ప్రాంతం నుంచి కిందకు దిగేందుకు ఇనుప గొట్టాలు అమర్చి మెట్లు, కూర్చునేందుకు సిమెంట్ దిమ్మలు నిర్మించారు. కాఫీహౌస్, దుకాణాలతో పాటు ప్రధాన ద్వారం వద్ద ఏసుప్రభువు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొత్తపల్లి జలపాతాలను ప్రకృతి అందాలకు తగ్గట్టుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.