అర్ధంతరంగా ముగింపు
- అజెండా అంశాలపై సాగని చర్చ
- బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలన్న ఎమ్మెల్యేలు, ఎంపీపీలు
- కుదరదన్న కలెక్టర్ యువరాజ్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- స్తంభించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
పాడేరు : ఐటీడీఏ పాలవర్గ సమావేశంలో బాక్సైట్ భగభగలు మరోసారి మిన్నంటాయి. ఏజెన్సీలో ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు పట్టుబట్టడంతో అజెండాలోని అంశాలు చర్చించకుండానే అర్ధంతరంగా ముగిసింది. బాక్సైట్ రగడతో ఈ ఏడాది ఏప్రిల్ 26న నిర్వహించిన సమావేశం కూడా అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇదే అంశం పునరావృతం కావడంతో రెండోసారి పాలక మండలి సమావేశం స్తంభించింది. ఆది వారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఐటీడీఏ వైస్ చైర్మన్, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ పప్ప ల చలపతిరావు హాజరయ్యారు.
సంబంధిత మంత్రులు రాలేదు. సమావేశం ప్రారంభించగానే పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, జి.మాడుగుల, పెదబయలు, హుకుం పేట, అరకు, జికేవీధి, చింతపల్లి, డుంబ్రిగుడ ఎంపీపీలు ఎంవి గంగరాజు, ఉమా మహేశ్వరరావు, టి.మాధవి, అరుణకుమారి, సాగిన బాలరాజు, కవడం మచ్చమ్మ, జమున, చింతపల్లి, పాడేరు, జీకేవీధి జెడ్పీటీసీలు కంకిపాటి పద్మకుమారి, పోలుపర్తి నూకరత్నం, గంటా నళినిలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాలని, కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఈ తీర్మానాల కోసం ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు లేచి నిలబడి నినాదాలు చేశారు.
బాక్సైట్ అంశాన్ని ఎజెండాలో చేర్చాలన్నారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్ దీనిపై మౌనం వహించారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ స్పందిస్తూ బాక్సైట్ అంశంపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని, ఐటీడీఏ పాలక మండలిలో తీర్మానం చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. ఐటీడీఏ పాలకవర్గం ద్వారా సబ్ కమిటీని వేసి బాక్సైట్‌పై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టు విడవలేదు. గత పాలక మండలి సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించి ప్రజా ప్రతినిధులు అందించిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి పంపించామని, ఈసారి ముఖ్యమంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీలను తాను కలిసినప్పుడు ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకు వెళతానని కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
దీనికి ఎమ్మెల్యేలు మళ్లీ అడ్డుతగిలారు. బాక్సైట్‌పై ఏ నివేదిక అయినా తవ్వకాలకు వ్యతిరేకంగానే ఉంటుం దని, దీనిపై తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం ముందుకు సాగనివ్వకపోవడంతో కలెక్టర్ అరగంటసేపు వేచిచూస్తామని చెప్పి తర్వాత సమావేశం ముగిసినట్టు ప్రకటించారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు బాక్సైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. ఐటీడీఏ పీవో హరినారాయణన్‌తోపాటు, అన్ని శాఖల జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులంతా హాజరయ్యారు.
గిరిజన సంక్షేమంపై చిన్న చూపు...
గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం అలక్ష్యం వహించిందని, పాలక మండలి సమావేశానికి సంబంధిత మంత్రులు హాజరుకాకపోవడం ఇందుకు నిదర్శనమని, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గిరిజనుడిని గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం నియమించ లేకపోయిందని విమర్శించారు. పాలకవర్గ సమావేశానికి కచ్చితంగా ప్రభుత్వం తరపున మంత్రి హాజరయ్యేవారని, ప్రజా సమస్యలకు పరిష్కారం ఉండేదని, మంత్రులు హాజరుకాలేని పరిస్థితులు ఉంటే గతంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశాలను వాయిదా వేసేవారని అన్నారు.
మంత్రులు డుమ్మాకొట్టడం విచారకరమన్నారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం నిధులు విదల్చడం లేదని, పథకాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే తీరులో ఇలాంటి సమావేశాలు మిగిలిపోకూడదని, జవాబుదారీగా, గిరిజన సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పాలకమండలి సమావేశం వేదికగా ఉండాలని, ఇకనైనా పాలకవర్గ సమావేశాలను నిర్దుష్టంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.