ITDA Project
-
బువ్వపెట్టించండి సారూ..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్ఎం, డీఓటీ, డీఎంఎల్టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్ఎం, డీఎంఎల్టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని వినతి ఐటీడీఏ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి మెస్‌చార్జీలు ఇస్తేగానీ భోజనం పెట్టే పరిస్థితి లేదని విద్యార్థినులు వాపోతున్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హనుమంత్ కె జెండగేకు విన్నవించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు, బస్‌పాస్, పుస్తకాలు, యూనిఫాం, సరైన వసతులు కల్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. స్పందించిన పీఓ ఏపీఓ వసంతరావు ద్వారా హైదరాబాద్‌లోని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్లో మాట్లాడమని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా బిల్లులను అందించడానికి చర్యలు చేపడుతున్నామని, మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఓ వార్డెన్‌ను ఫోన్లో కోరారు. -
చెంచులకు వంద శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని చెంచులకు వందశాతం సబ్సిడీతో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మినీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. చెంచులకు 250 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ కాస్ట్ రూ.30వేలు ఉండగా రూ.22,500 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన రూ.7,500 ఐటీడీఏ భరిస్తుందని తెలిపారు. ఆళ్లగడ్డ మండలానికి 16 యూనిట్లు, రుద్రవరం ఏడు యూనిట్లు, జూపాడుబంగ్లా 3, నందికొట్కూరు 4, ఆత్మకూరు 109, బండి ఆత్మకూరు 26, కొత్తపల్లి 18, మహానంది 1, పాణ్యం 10, శ్రీశైలానికి 26, వెలుగోడుకు 30 ప్రకారం మొత్తం 250 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీడీలు పి.రమణయ్య, జీవీ రమణ, సీవీ రమణయ్య, పలువురు పశువైద్యులు పాల్గొన్నారు. -
సర్కారీ చదువుకు సెలవు?
రంపచోడవరం : ఏజెన్సీలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ యాజమాన్యంలోని పాఠశాలలకు మంగళం పాడేందుకు రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న పది జెడ్పీ ఉన్నత పాఠశాలలను మూసివేస్తున్నారు. వీటిలో మారేడుమిల్లిలోని మండల పరిషత్ యాజమాన్యంలో ఉన్న మోడల్ పాఠశాలను కూడా కాలగర్భంలో కలిపేస్తున్నారు. దాదాపు అర్ధశతాబ్దం పైగా ఏజెన్సీలో విద్యార్థులకు అందుబాటులో విద్యాబోధన అందించిన పాఠశాలలను ఐటీడీఏ యాజమాన్యానికి అప్పజెప్పడంపై తల్లిదంద్రుడలు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పరిపాలన కేంద్రం రంపచోడవరంలో ఉన్న ఏజెన్సీలోని ఏకైక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సైతం ఐటీడీఏకి అప్పగించి చేతులు దులుపుకొనేందుకు విద్యాశాఖ సమాయత్తం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. విలీనమయ్యే పాఠశాలలు ఇవే వై.రామవరం మండలంలోని వై.రామవరం, డొంకరాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలు, అడ్డతీగల మండలం రాయపల్లి, రాజవొమ్మంగి మండలం జడ్డంగి, గంగవరం మండలం గంగవరం జెడ్పీ పాఠశాల, రంపచోడవరం మండలంలోని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గెద్దాడ జెడ్పీ పాఠశాల, మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి జెడ్పీ పాఠశాల, చింతూరు మండలంలో మోతుగూడెం జెడ్పీ పాఠశాల, దేవీపట్నం మండలం దేవీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఐటీడీఏకు అప్పగించేందుకు క్షేత్రస్థాయిలో పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాఠశాలలు అన్నీ ఈ వేసవి సెలవుల అనంతరం ఐటీడీఏ యాజమాన్యంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా నామాంతరం చెందుతాయని గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరస్వతి తెలిపారు. ఈ పది జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సొంత యాజమాన్యానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలుగా మారిన తరువాత గిరిజన సంక్షేమ యాజమాన్యానికి చెందిన ఉపాధ్యాయులను నియమిస్తామని డీడీ తెలిపారు. గిరిజనేతర విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకం ఏజెన్సీలో ఎక్కువ మంది గిరిజనేతరులు చదువుల కోసం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయా విద్యార్థులకు తిప్పలు తప్పవు. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునేందుకు గిరిజనేతర విద్యార్థులను చేర్పించుకున్నా ఇప్పటి వరకు జెడ్పీ పాఠశాలల ద్వారా అందే సౌకర్యాలు విద్యార్థులు కోల్పోతారు. గిరిజన సంక్షేమ శాఖ కేవలం గిరిజన విద్యార్థుల ప్రయోజనాలు కోసం మాత్రమే నిధులు ఖర్చు చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గిరిజనేతర విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి వాటికి దూరం కావాల్సిందే. ప్రస్తుతం పది పాఠశాలలను విలీన చేస్తున్నా, వచ్చే విద్యా సంవత్సరానికి మిగతా జెడ్పీ పాఠశాలలను కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలుగా మార్చనున్నట్టు సమాచారం. -
పకడ్బందీగా పీసా చట్టం అమలు
సీతంపేట: పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. సీతంపేటలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలకు రెండు రోజుల పాటు జరగనున్న పీసాచట్టం అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై గ్రామసభల్లో తీర్మాన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా పీసా అనుమతి తప్పని సరిగా తీసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. మైనింగ్, గనుల తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణన్, రిసోర్స్ పర్సన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో జాతీయ బ్యాంకు సేవలు విస్తృతం
మండల కేంద్రాల్లో కొత్త శాఖల ఏర్పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్ పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ప్రజలందరికీ జాతీయబ్యాంకుల సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. పాడేరులో ఆంధ్రాబ్యాంకు నూతన శాఖను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లోను రెండు, మూడు జాతీయ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రజలకు బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రోత్సాహకాలు, రాయితీలు సకాలంలో అందేవిధంగా కొత్తబ్యాంకుల సేవలు ఉంటాయన్నారు. ఆరునెలల నుంచి ఏజెన్సీలో బ్యాంకుల సేవల విస్తరణకు తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఐటీడీఏ సిద్ధమవడంతో అనేక జాతీయ బ్యాంకులన్నీ ఏజెన్సీలో కొత్తశాఖల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని వారందరికీ ఏజెన్సీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. బ్యాంకుల ఏర్పాటుకు అద్దె భవనాల కొరత ఉండడంతో ఐటీడీఏ బ్యాంకులకు భవనాలను సమకూరుస్తుందన్నారు. డుంబ్రిగుడ, ముంచంగి పుట్టు, పెదబయలు కేంద్రాల్లో కూడా ఆం ధ్రాబ్యాంకు శాఖల ఏ ర్పాటుకు చర్యలు తీ సుకుంటున్నామన్నా రు. ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మే నేజర్ జి.వి.లలిత్ ప్ర సాద్ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ సహకారంతో పాడేరులో ఆంధ్రాబ్యాంకు 105 వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఏటీఎంను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద బీమా సేవలను కూడా వినియోగదారులకు అందిస్తామన్నారు. అంతకుముందు ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్ట్రాంగ్ రూంను ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, బ్యాంక్ కౌంటర్‌ను ఆర్డీఓ రాజకుమారిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు ఏజీఎం ఎ.రవిరమణ, చీఫ్ మేనేజర్ రామకోటయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమణమూర్తి, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ డీఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఐకేపీ ఏపీడీ రత్నాకర్, ఐటీడీఏ ఉద్యానవన అధికారి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ ప్రారంభించే భవన నిర్మాణ పనులను పరిశీలించారు.