ఐడియాకు జియో దెబ్బ
ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా కు రిలయన్స్ జియో ఎఫెక్ట్ భారీగా తాకనుంది. రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సంస్థ పెర్ ఫామెన్స్ వీక్ గా ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా తన వాటాను అమ్మేందుకు యోచిస్తోంది. జియో ఉచిత సేవల కారణంగా మరో మూడేళ్లపాటు ఐడియా పనితీరు మందగించే అవకాశమున్నట్లు మలేసియన్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడియాలో తన 20శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ మేరకు గతంలో టెలీకాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలుకోసం ఐడియా సెల్యులర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ను సంప్రదించింది. (ఆదిత్యా బిర్లా గ్రూపు ఐడియాలో 40 శాతం వాటా ఉంది) అయితే దానికి తిరస్కరించడంతో ఇతర కొనుగోలుదారులకోసం చూస్తోంది. ఈ మేరకు బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఐడియా, ఆక్సియాటా సంస్థలు నిరాకరించాయి.
కాగా పెద్ద నోట్ల రద్దుతో రూ.100- 200 మధ్య ఐడియా రిచార్జ్ లు గణనీయంగా తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే 2 శాతం క్షీణించిన ఐడియా ఆదాయం ఈ క్వార్టర్ లో 4-5 శాతం వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఆక్సియాటా వాటా విక్రయిస్తే..ఐడియాకు మరిన్ని కష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలతో మార్కెట్ లో ఐడియా కౌంటర్ బలహీనపడింది. సుమారు 3.28 శాతం నష్టాలతో కొనసాగుతోంది. మొబైల్ బిల్లులను రద్దయిన నోట్లతో చెల్లించడానికి డిశెంబర్ 15 వరకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.