ఆపిల్ యూజర్లకు తాజా వార్నింగ్
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ వినియోగదారులకు మరో స్కాంకు సంబంధించి తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఐట్యూన్స్ గిఫ్ట్ కార్డ్, మనీ ట్రాన్స్ఫర్ పేరుతో జరుగుతున్న టిపిక ల్ స్కాం పట్ల యూజర్లను అప్రమత్తం చేసింది. ఐ ట్యూన్స్ బహుమతి కార్డులు కొనుగోలు ద్వారా డబ్బు బదిలీకి ఒత్తిడి చేస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వినియోగదారులను హెచ్చరించింది. ఆపిల్ తన అధికారిక వెబ్ సైట్ లో ఈ హెచ్చరికలను జారీ చేసింది.
ఆపిల్ అందించిన సమాచారం ప్రకారం మొదట..ఈ తరహా నేరగాళ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదా వేల డాలర్ల విలువగల గిప్ట్ కార్డ్ లు కొనుగోలు చేయమంటూ యూజర్లను మభ్యపెడతారు. అనంతరం యూజర్ ద్వారా 16 అంకెల కార్డు కోడ్ ను తెలుసుకొని మోసాలకు పాల్పడుతారని అధికారిక వెబ్ సైట్ లో హెచ్చరించింది. తాము ఎలాంటి నగుదు బట్వాడాలేవీ అంగీకరించడం లేదని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఐ ట్యూన్స్ కార్డులు, ఆన్ లైన్ కొనుగోళ్లకు, డిజిటల్ సంగీతం, పుస్తకాలు, యాప్స్ కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది.
గతంలో అధికారులు ప్రీపెయిడ్ డెబిట్ కార్డులకు సంబంధించి ఇలాంటి స్కామ్ గురించి హెచ్చరించారు. మరోవైపు పాపులర్ యాపిల్ గిఫ్ట్ కార్డుల ద్వారా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని ఇటీవల ఐఆర్ఎస్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాపిల్ ఈ తాజా వార్నింగ్ జారీ చేసింది. అలాగే ఆన్ లైన్ లో పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేస్తున్న వారికి తరచూ టిప్స్ యిస్తూ, అప్రమత్తం చేస్తున్నట్టు ఆపిల్ వెల్లడించింది