21 మంది లిఫ్టర్లపై వేటు
న్యూఢిల్లీ : డోపింగ్ పరీక్షలో విఫలమైన 21 మంది భారత వెయిట్‌లిఫ్టర్లపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించారు. జనవరిలో జరిగిన జాతీయ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఎక్కువ మంది దొరికినట్టు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య తెలిపింది. ‘21 మంది లిఫ్టర్లు డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. వారి ‘బి’ శాంపిల్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘటనగా చెబుతున్నా యూనివర్శిటీ, పోలీస్ గేమ్స్, రైల్వేస్ ఇలాంటి పోటీల్లోనూ కొందరు పట్టుబడిన విషయం గుర్తుంచుకోవాలి. సదరు ఆటగాళ్ల ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే తొలిసారి శిక్ష కింద నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐడబ్ల్యుఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌లపై కూడా నిషేధంతో పాటు జరిమానా విధించారు.