మరోసారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్!
కొత్త పుస్తకం (నేడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జయంతి)
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గురించి గతంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఏదైనా పుస్తకం వచ్చినా, కొత్తగా ఆయన గురించి తెలుసుకునేదేముంది? అనుకోవడానికి లేదు. తెలిసిన విషయాలు చదివినా, తెలియని విషయాలు చదివినా ఆయన వ్యక్తిత్వం, కార్యాచరణ నుంచి ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందవచ్చు. ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్- ఏ లైఫ్ విత్ ఫ్లైట్’ పేరుతో ఇటీవల నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితకథ వచ్చింది. జర్నలిస్ట్ జె బార్బ్రీ ఈ పుస్తకాన్ని రాశారు.
ఎన్బిసి న్యూస్రిపోర్టర్గా ప్రసిద్ధిగాంచిన జె అమెరికాకు సంబంధించిన అంతరిక్ష కార్యక్రమాలను ఎన్నో కవర్ చేశారు. అయిదు దశాబ్దాల... ఇంటర్వ్యూలు, నోట్స్, జ్ఞాపకాలు, సమావేశాలు... వీటి ఆధారంగా జె ఈ పుస్తకం రాశారు. రచయితకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సన్నిహితుడు కావడం కూడా పుస్తకం విలువను పెంచింది. ఎందరో ఉండగా, చంద్రుడిపై పాదం మోపడానికి అగ్రదేశం అమెరికా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎందుకు ఎంచుకుంది? ఆయనలోని ప్రత్యేకతలు ఏమిటి? జె మాటల్లో చెప్పాలంటే...
‘అసాధారణ మేధా, నిర్వహణ నైపుణ్యం, ఎంత ఒత్తిడికైనా లొంగని మనసు, స్పష్టమైన ఆలోచన తీరు’ ఇవి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అందరి దృష్టి తన మీదే ఉండాలని, తన గురించే మాట్లాడుకోవాలని ఆయన ఎప్పుడూ ఆలోచించేవారు కాదని అంటారు జె.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి వచ్చిన అన్ని పుస్తకాల్లోలాగే ‘మూన్ ల్యాండింగ్ మూమెంట్’ గురించి ఈ పుస్తకంలో ఉన్నప్పటికీ, దానికంటే కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యక్తిత్వ పరిచయం పాఠకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
మూడు వందల యాభై పేజీల ఈ పుస్తకంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు సంబంధించిన విలువైన ఉటంకింపులు ఉన్నాయి. ‘గొప్ప వ్యక్తుల గురించి వందసార్లు మాట్లాడుకున్నా... ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుంది’ అంటుంటారు. ఈ నేపథ్యంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి బాగా తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు కూడా చదవదగిన పుస్తకం ఇది.