అభినందించడానికి వచ్చి.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు
హైదరాబాద్: తమ అభిమాన మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తుంటే అభినందించడానికి సచివాలయానికి వచ్చిన వారిని అనుకోని ఒక సంఘటన కంగారు పెట్టించింది. సచివాలయంలోని జే బ్లాక్‌లో ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా వారి అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మూడు లిఫ్టుల్లో 2 మంత్రులకు, వీఐపీలకు, ఒకటి సందర్శకులకు కేటాయించారు. మంత్రుల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎనిమిదో అంతస్తు నుంచి కిందికి రావడానికి దాదాపు 15 మంది సందర్శకుల లిఫ్ట్ ఎక్కారు.
రెండు ఫ్లోర్లు దిగిన తర్వాత 6, 5 అంతస్తుల మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న వాళ్లు తమకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసినా తక్షణం ఎవరూ స్పందించలేదు. దీంతో మొరాయించిన లిఫ్ట్‌లో అరగంటకు పైగా ఊపిరాడని పరిస్థితిలో వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.ఎలాగో అలా లోపలి వైపు తలుపు బలవంతంగా తెరవగలిగినా, బయటవైపు తలుపులు తెరుచుకోలేదు. ఇంతలో లిఫ్ట్‌లో ఉన్న ఒకరు సహచరుడికి విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మెకానిక్‌ను రప్పించి తలుపులు తెరిపించారు. దీంతో లోపలివాళ్లంతా బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.