తొలి జీతం నుంచే పొదుపు మొదలవ్వాలి
ఇటీవలే మా అమ్మాయిది ఇంజినీరింగ్ పూర్త యింది. క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఇన్ఫోసిస్లో ఉద్యోగం సంపాదించింది. తనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం ఎలా?
- జె. సునీత, హైదరాబాద్
మధ్యతరగతి నుండి వచ్చి మంచి జాబ్ సంపాదించుకున్న వారిలో ఎక్కువశాతం మంది... సంపాదన మొదలవ్వగానే చేసే పని ఏమిటంటే - అప్పటివరకు ఆపుకున్న సరదాలను, కోరికలను తీర్చుకోడానికి సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడం. కాబట్టి తొలి సంపాదన నుంచే పొదుపు ద్వారా (ఎర్లీ సేవింగ్స్) వచ్చే లాభాలను, అలా చేయకుంటే కలిగే నష్టాలను కింది ఉదాహరణతో తనకి తెలియజేయండి.
ఉదాహరణ: 20 ఏళ్ల వయసులో సేవ్ చేయడం మొదలుపెట్టి 35 సంవత్సరాలపాటు ఏడాదికి 10 వేలు చొప్పున 55 ఏళ్లొచ్చే వరకు సేవ్ చేసినట్లయితే, మనం సేవ్ చేసిన రు. 3,50,000లు 10 శాతం వడ్డీతో కలిపి 33.38 లక్షలకు చేరుతుంది. అంటే దాదాపు 10 రెట్లు పెరుగుతుంది. అదే 25వ యేట సేవింగ్స్ మొదలు పెడితే మీరు సేవ్ చేసే 3 లక్షలు 6.6 రెట్లు, 30లో మొదలు పెడితే మీరు సేవ్ చేసే రెండున్నర లక్షలు 4.6 రెట్లు మాత్రమే పెరుగుతుంది.
ఇక 40లో మొదలు పెడితే కేవలం 2.4 రెట్లు మాత్రమే పెరిగి మీ లక్షా 50 వేలు కేవలం 3.65 లక్షలు అవుతుంది. అంటే ఎంత ఎర్లీగా మొదలు పెడితే అన్ని రెట్లు ఎక్కువగా పెరుగుతుందన్నమాట. కేవలం పది శాతం వడ్డీ సంపాదించేటప్పుడే ఇలా ఉంటే, హెచ్చురేట్లు ఉన్నప్పుడు లేదా అధిక ఆదాయం వచ్చే ఇతర మార్గాలలో ఇంకెంత లాభం కోల్పోతామో తెలియజెప్పండి.
- వి.వి.కె.ప్రసాద్
‘వివేకం’ ఫైనాన్షియల్ సర్వీసెస్