క్రమశిక్షణకు మారుపేరు
కృషి, పట్టుదల, తపన, క్రమశిక్షణ... ఈ నాలుగూ ఉంటే, కాస్త ఆలస్యమైనా.. అనుకున్నది సాధించొచ్చు అనడానికి పీజే శర్మ(70) జీవితమే ఉదాహరణ. 1957లో చిన్న నటునిగా సినీ ప్రస్థానం ప్రారంభించారాయన. కానీ ఈ రోజున ప్రేక్షకులతో కొనియాడబడే ప్రముఖ సినీకుటుంబాల్లో పీజే శర్మ కుటుంబం ఒకటి.ఈ ఘనత సాధించడంలో శర్మ కృషి నిజంగా అభినందనీయం.
విజయనగరం జిల్లా కల్లేపల్లిలో జన్మించిన పీజే శర్మ ఉరఫ్ పూడిపెద్ది జోగీశ్వరశర్మ.. 12 ఏళ్ల ప్రాయంలోనే రంగస్థల జీవితంమొదలుపెట్టారు. జేవీ సోమయాజులు, జేవీ రమణమూర్తిలతో కలిసి వందల నాటకాల్లో అభినయించారు. దైవదత్తంగా సంక్రమించినకంచు కంఠం శర్మకు వరంగా పరిణమిల్లింది. అద్భుతమైన వాచకంతో ప్రేక్షకుల్ని సమ్మోహనుల్ని చేసేవారాయన. ఆ రంగస్థలమే ఆయన్ను ఓ ఇంటివాణ్ణి కూడా చేసింది. సహనటి కృష్ణజ్యోతిని ప్రేమవివాహం చేసుకున్నారు శర్మ. రంగస్థలం ఆత్మసంతృప్తిని తప్ప.. ఆర్థిక బలాన్ని ఇవ్వకపోవడంతో.. మద్రాసు పయనమై ‘ఇల్లరికం’ (1957)తో సినీ ప్రస్థానం ప్రారంభించారు పీజే శర్మ. వచ్చిన ప్రతి చిన్న పాత్రనూ పోషిస్తూ, ఆ కొద్ది మొత్తంతో కుటుంబ భారాన్ని మోసేవారు.
మహానటుల ప్రాభవంతో కళకళలాడుతున్న స్వర్ణయుగ వైభవంలో నటునిగా నెట్టుకురావడం శర్మకు కష్టతరమైంది. అందుకే తన కంఠాన్ని నమ్ముకొని అనువాద కళాకారునిగా మారారు. తెలుగు, తమిళ అనువాద చిత్రాల ద్వారా ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. ఇలా.. అనువాద కళాకారునిగా వెయ్యికి పై చిలుకు, నటునిగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 500పై చిలుకు చిత్రాలకు పనిచేశారాయన. డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది, ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. పల్నాటి యుద్ధం, దానవీరశూరకర్ణ, సంపూర్ణ రామాయణం, భక్తతుకారం, కలెక్టర్ జానకి, ఎర్రమల్లెలు, ఖైదీ, విజేత, తొలిప్రేమ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి చిత్రాల్లో భాగమయ్యారు పీజే శర్మ.
నట దిగ్గజాలు ఎన్టీయార్, ఏఎన్నార్, ఎమ్జీయార్, శివాజీగణేశన్, దిలీప్‌కుమార్, అమితాబ్‌లతో పనిచేసిన ఘనత పీజే శర్మది. సినిమా తప్ప ఆయనకు మరో లోకం ఉండేది కాదు. చివరకు తన పెద్ద కుమారుడు సాయికుమార్‌లోని అభినయ ప్రతిభను గమనించి పసి వయసు నుంచీ సాయిని నటునిగా ప్రోత్సహించారు శర్మ. తండ్రి బాటలోనే పయనించి ‘డైలాగ్ కింగ్’ అనిపించుకున్నారు సాయికుమార్. తర్వాత కాలంలో తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ విధంగా కొడుకు సాయికుమార్ రూపంలో అనుకున్నది సాధించారు పీజే శర్మ. తన రెండో కుమారుడు రవిశంకర్ కూడా అనువాద కళాకారుడిగా నంబర్‌వన్ అనిపించుకున్నారు. మూడో కుమారుడు అయ్యప్ప.
పి.శర్మ తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సాయికుమార్ తనయుడు, పీజే శర్మ మనవడు ఆది యువ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. ఇలా ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ, చిరంజీవి కుటుంబాలతో పాటు తన కుటుంబానికి కూడా ఓ సముచిత స్థానాన్ని సంపాదించుకోగలిగారు పీజే శర్మ. సినిమాపై, కళలపై ఆయనుకున్న అపారమైన ప్రేమే ఆయనకు ఈ ఘనతను కట్టిపెట్టింది. క్రమశిక్షణకు మారుపేరైన పీజే శర్మ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా తీరని లోటే.