సర్కారుకు కోటింగ్!
- రూ.2.11 కోట్ల రికవరీకి రూ.కోటి ఖర్చు
- సామాజిక తనిఖీల్లో అధికారుల పనితనం
- ‘ఉపాధి’ వెలుగు చూస్తున్న అవకతవకలు
- ఆరేళ్లలో రూ.4.54 కోట్ల స్వాహా
పావలా కోడికి ముప్పావలా మసాలా.. అన్నట్టుంది అధికారుల తీరు. ఉపాధి హామీ పథకం పనుల్లో భారీగా నిధుల స్వాహా జరిగింది. దీనిపై సామాజిక తనిఖీలు, విచారణలకు అక్షరాలా రూ.కోటికి పైగా ఖర్చయింది. ఇంతాచేస్తే కేవలం రూ.2.11 కోట్లు వసూలైంది. అవినీతిపరులకు కళ్లెం వేయాల్సిన సామాజిక త నిఖీలు వారికే ఊతమిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేయడం తప్ప స్వాహా అయిన నిధులను రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని 39 మండలాల్లో 5,803 హేబిటేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,68,632 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేశారు. 31,503 శ్రమశక్తి సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఈ గ్రూపుల్లో 6,75,453 మంది కూలీలున్నారు. ఏటా సరాసరిన నాలుగు లక్షల మం దికి డిసెంబర్ నుంచి మార్చి వరకు 70 లక్షలకు పైగా పనిది నాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు రూ. 75 కోట్లు చెల్లిస్తుంటారు. రూ.300కోట్లకుపైగా విలువైన పను లు జరుగుతుంటాయి. సోషల్ ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అంటే ఆరేళ్ల లో రూ.4,54,31,793లు ప్రజాధనం స్వాహా అయినట్టుగా నిర్ధారించారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకు రూ.2,11,86,010లు మాత్రమే రికవరీ చేయగలిగారు.
ఈ అవకతవకలకు బాధ్యులుగా వివిధ స్థాయిల్లో పనిచేసే 296 మందిని తొలిగించగా, 2260 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ రూ.రెండుకోట్ల రికవరీకోసం సామాజిక తనిఖీలు, విచారణల పేరిట అక్షరాల రూ.కోటికి పైగా ఖర్చు చేశారని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన రూ.4.54కోట్లు అవినీతి జరిగితే రికవరీ చేసింది కేవలం రూ.కోటి మాత్రమేనన్న మాట. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన తీరుకు అద్దంపడుతోంది. ఆరేళ్లలో జరిగిన ఉపాధి హామీ పనులపై మరింత లోతైన విచారణ చేపడితే స్వాహా సొమ్ము కూడా పెద్ద ఎత్తునే ఉంటుందన్న వాదన ఉంది. చాలా కేసుల్లో అక్రమార్కులకు కొమ్ముకాసేలా అధికారులు వ్యవహరించారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.