జిల్లా కోసం 23 నుంచి ఆమరణ దీక్ష
జనగామ డివిజన్లో రేపటి నుంచి 48 గంటల బంద్
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి
జనగామ : రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు అనుకూలంగా ప్రకటన చేయని పక్షంలో ఈనెల 23 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రకటించా రు. ఈనెల 14వ తేదీన జిల్లా జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ ఉండడంతో ముందస్తు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేశారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా సాధన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అసలు శాస్త్రీయ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది.. పార్టీలకతీతంగా సన్నద్ధం కండి.. ఇప్పుడు చేసే ఉద్యమమే కీలకంగా మారుతుండడంతో పోరాటాన్ని ఉరుకులు పెట్టించాల న్నారు. ఈనెల 14న ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈనెల 13, 14వ తేదీ వరకు 48 గంటల పాటు జనగామ డివిజన్ బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న జాతీయ జెండాతో పాటు జనగామ జెండా ఎగురవేస్తామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో ముందస్తు అరెస్టులు చేస్తే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పోలీస్‌స్టేçÙన్ ముట్టడించాలన్నారు. ఈనెల 14న జరిగే ప్రజాప్రతినిధుల సమావేశం, 15న మంత్రుల సబ్‌కమిటీ రిపోర్టు ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
చివరి అస్త్రంగా జనగామ జిల్లా వచ్చుడో.. దశమంతరెడ్డి చచ్చుడో అనే నినాదంతో ఈనెల 23వ తేదీన ఆమరణ దీక్ష చేపడుతామన్నారు. జోనల్ సమస్య తలెత్తకుండా స్టేషన్‌ఘన్‌పూర్ 3, పాలకుర్తి 5, జనగామ నియోజకవర్గంతో పాటు కొత్తగా ఏర్పడే మండలాలు కొమురవెల్లి, తరిగొప్పుల, చిల్పూరు మండలాలను కలిపే పటాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజమౌళి, మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్‌రావు, పజ్జూరి గోపయ్య, మంగళ్లపల్లి రాజు, చిన్నం నర్సింహులు, కృష్ణారెడ్డి, రత్నాకర్‌రెడ్డి, తీగల సిద్దూ, మాజీద్, మోర్తాల ప్రభాకర్, పి.సత్యం పాల్గొన్నారు. కాగా జనగామ జిల్లా కోసం పట్టణంలోని ఎనిమిదో వార్డు మహిళా కౌన్సిలర్ జక్కుల అనిత గురువారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డికి అందజేశారు. గతంలో 25 వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ ఆకుల రజని సతీష్ రాజీనామా చేయగా, అనితతో రాజీనామాల సంఖ్య రెండుకు చేరింది.