త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు
పరిగి: రాష్ట్రంలో విడివిడిగా ఉన్న రైతు సంఘాలన్నింటినీ ఏకం చేసి త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు చేస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్న అభివృద్ధి చెందితే దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లేనన్నారు. నేడు రైతులు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతుండటం వారి దుర్భరస్థితిని, అప్పుల వెతలను తెలియజేస్తుందన్నారు. రైతులు సంఘటితంగా ఉండాలని, అప్పుడే వారికి మంచి రోజులు వస్తాయన్నారు.
రైతును మార్కెట్ శక్తులు దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. చెట్టుకు చెద పురుగులు పట్టినట్లుగా రైతులను మార్కెట్ శక్తులు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఉత్పత్తులకు రైతులు తప్ప.. ఇతర రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకు ధర నిర్ణయిస్తుండగా.. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం ఇతర శక్తులు లాగేసుకుంటున్నాయన్నారు. అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వ మద్దతు కూడా అందడం లేదన్నారు. బడ్జెట్లో రైతుకు న్యాయం జరగాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు అవసరమైన విధానాలు రూపొందించాలన్నారు. నాసిరకం ఎరువులు, విత్తనాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయన్నారు. రైతులందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తేనే సమస్యలను నుంచి గట్టెక్కుతారని తెలిపారు. రైతులు చేసే ఏ ప్రయత్నానికైనా జేఏసీ అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత రైతులపై వివక్ష చూపటమే కాకుండా విధ్వంసం సృష్టించాయని తెలిపారు.
మార్చి చివరి వారంలో రైతు సదస్సు..
మార్చి చివరివారంలో పరిగిలో రైతు సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. రైతులు, రైతుల సంఘాలు ఎవరికి వారు కాకుండా ఒక్క తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. పరిగి మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ రైతు సదస్సుకు రైతులు, రైతు సంఘాలన్నీ హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నియోజకవర్గ కన్వీనర్ బసిరెడ్డి, జేఏసీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ ఆంజనేయులు, రైతు సంఘాల నాయకులు మిట్టకోడూర్ బాబయ్య, వెంకట్రాంరెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.