మూడోరోజుకు మున్సిపల్ సమ్మె
♦ మంత్రి నాయినితో కార్మిక నేతల చర్చలు మళ్లీ విఫలం
♦ వేతనాల పెంపుపై స్పష్టమైన హామీకి కార్మికుల పట్టు
♦ తప్పకుండా న్యాయం చేస్తాం..ముందు సమ్మె విరమించండి: మంత్రి
♦ మొండిగా వెళ్తే బెదరం.. చీపురు పట్టి మేమే చెత్త తొలగిస్తామని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. బుధవారం నాటికి మూడోరోజుకు చేరుకుంది. హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి నేతృత్వంలో బుధవారం సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం మంత్రి, కార్మిక జేఏసీ నేతలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక నేతలు స్పష్టంచేశారు.
‘‘ఏ ప్రాతిపదికన వేతనాలను పెంచుతారో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారు. కార్మికులు సమ్మె విరమించి సర్కారుకు కొంత సమయం ఇవ్వాలి’’ అని నాయిని పేర్కొన్నారు. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ఎవరూ పట్టు వీడకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ‘‘కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ సానుభూతితో ఉన్నారు. కొంచెం సమయం కావాలని కార్మికులకు చెప్పి వారితో సమ్మెను విరమింపజేయించాలన్నారు. తప్పకుండా మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తాం. మొండిగా సమ్మె చేస్తామంటే మేం కూడా బెదరం. చీపురు పట్టి మేమే చెత్తను తొలగిస్తాం’’ అని చర్చల అనంతరం మంత్రి నాయిని వ్యాఖ్యానించారు.
డిమాండ్లను పరిష్కరిస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమైనా... కార్మిక నేతల నిర్దిష్ట గడువును కోరడం సరికాదన్నారు. సమ్మె నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా సమ్మె విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సమ్మె కొనసాగిస్తే సీఎంకు కోపం వస్తదని, అప్పుడు తీవ్ర పరిస్థితులు ఉంటాయని అధికారులు బెదిరిస్తున్నారని కార్మిక నేతలు ఆరోపించారు. సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయన వద్దకు చర్చల కోసం ఎందుకు తీసుకెళ్లలేదని వారు ప్రశ్నించారు. సమ్మె కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తీవ్ర సమస్యల్లో ఉండడం వల్లే సమ్మె చేస్తున్నామని, ప్రజలకు జీవితాంతం సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు.
‘చెత్త’పై పిల్
5 రోజులుగా జంటనగరాల్లో చెత్త పేరుకుపోయిందని, దీన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది రాజేశ్వరి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. లంచ్ మోషన్ రూపంలో విచారించాలని న్యాయవాది సత్యంరెడ్డి కోర్టును కోరారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ ఈ పిల్‌ను గురువారం విచారణ చేపడతామని పేర్కొంది. చెత్త వల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందని, రంజాన్ కావడంతో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ వివరించారు.