కోలాహలంగా నిమజ్జనోత్సవం
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: వినాయక చవితి ఉత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం గణనాథుని విగ్రహ నిమజ్జనోత్సవాలు నగరంలో కోలాహలంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపాల వద్ద ఉదయం నుంచి మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పలుచోట్ల మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం సర్వవిఘ్నహరుడ్ని వివిధ వాహనాల్లో కొలువుదీర్చి నేత్రపర్వంగా నగరంలో ఊరేగింపు జరిపారు. పలుచోట్ల లడ్డూల వేలాన్ని ఘనంగా నిర్వహించారు.
సందడే.. సందడి..
చంద్రమౌళీనగర్, వేదాయపాళెం, నిప్పోసెంటర్, భక్తవత్సలనగర్, పడారుపల్లి, వెంగళరావునగర్, పొదలకూరురోడ్డు, ఫతేఖాన్‌పేట, రామలింగాపురం, పెద్దబజారు, నవాబుపేట, స్టోన్‌హౌస్‌పేట, సుబేదారుపేట, కిసాన్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి గణనాథుని ప్రతిమలు ఊరేగింపుగా నగరంలోకి ప్రవేశించాయి.
ఆయా విగ్రహాలతో పాటు వచ్చేవారిని సంతపేట వద్ద గణేష్ నిమజ్జనోత్సవ కమిటీ ఆహ్వానించి, పెన్నానది వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం గణనాథుని ప్రతిమలను జాఫర్‌హుస్సేన్ కాలువలో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కార్పొరేషన్, పోలీస్ అధికారులు పెన్నాతీరాన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలాజీనగర్‌లోని 36 అడుగుల వీరగణపతి విగ్రహాన్ని ఆదివారం, అయ్యప్పగుడి సెంటర్లోని వినాయకుడి విగ్రహాన్ని మంగళవారం నిమజ్జనం చేయనున్నారు.