పట్టాలు తప్పిన రైలు: 12 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర దుర్ఘటన జరిగింది. బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నుంచి రావల్పిండికి ప్రాయాణిస్తున్న 'జాఫర్ ఎక్స్ ప్రెస్' అబీగుమ్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు చెల్లాచెదురు కావడంతో 12 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదంలో రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లు కూడా చనిపోయారని... సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయని పాకిస్థాన్ రైల్వే మంత్రి సయ్యద్ రఫీక్ చెప్పారు. సహాయ బృందాలకు తోడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు బెలూచిస్థాన్ ప్రావిన్స్ హోం మంత్రి సర్ఫరాజ్ తెలిపారు.
కాగా, నవంబర్ 1న ఇదే రైలుపై ఉగ్రవాదులు దాడి జరిపారు. శక్తిమంతమైన బాంబులతో రైలును పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి సంఘటనలో నలుగురు చనిపోగా, ఆరుగురికి గాయలయ్యాయి. ఆ తరువాత జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ సంఘటన వెనుక కూడా ఉగ్రవాదుల హస్తమేమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.