బాలకార్మికులకు విముక్తి
వికారాబాద్, న్యూస్‌లైన్: ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్న బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న జగదీశ్వర్ ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మండల విద్యాధికారి గోవర్ధన్ రెడ్డి, శివారెడ్డిపేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీఎన్ రెడ్డి మంగళవారం కంపెనీకి చేరుకున్నారు.
అక్కడ అబ్ధుల్ నవీద్, జావిద్‌పాషా, నవాజ్‌పాషా, సిద్ధిక్ అనే నలుగురు బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారితో మాట్లాడుతుండగా సిద్దిక్ పారిపోయాడు. విషయాన్ని అధికారులు ఫోన్లో సబ్ కలెక్టర్ ఆమ్రపాలికి సమాచారం అందించారు. స్పందించిన ఆమె బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. దీంతో అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు పిల్లలను శివారెడ్డిపేట్ పాఠశాలలో చేర్పించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.