'మతిభ్రమించిన ... చంద్రబాబు'
విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శ
సీనియర్లను బయటకు పంపిందే బాబు : మంత్రి మహేందర్‌రెడ్డి
టీడీపీలో ఉన్నదంతా పిక్ పాకెట్ బ్యాచ్ : ఎంపీ బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో దిగ్విజయమైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బహిరంగ సభను చూశాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మతి భ్రమించిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ సాధ్యమైందని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఓ అబద్దాన్ని పదే పదే చెబితే అది నిజమై పోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఆయన మరో మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్లతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్‌లో 14లక్షల మంది వలస పోయారని, ఆయన సీఎంగా వచ్చేంత వరకూ లేని రైతుల ఆత్మహత్యలు ఆయన సీఎం పీఠం ఎక్కగానే మొదలయ్యాయని, ఇదేనా ఆయన తెలంగాణకు చేసిన అభివృద్ధి అని నిలదీశారు. బషీర్‌బాగ్‌లో కాల్పులు, డ్వాక్రా, అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన సంఘటనలను తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలే దని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దగ్గర పనిచేశాడని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.
టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కేసీఆర్ ఒకరని, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ బి-ఫామ్‌పై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ మహానాడును హైదరాబాద్‌లో ఎవరు పెట్టమని ఆయనను ఆహ్వానించారు. ఏపీలో పెడితే అక్కడి రైతులు ముల్లుగర్ర పట్టకుని తరుముతారు. డ్వాక్రా మహిళలు వెంటపడతారు అనే భయం ఉంది. అందుకే హైదరాబాద్‌ను ఎంచుకుండు’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో రుణమాపీ జరగలేదని ఆంధ్రాబ్యాంకు సిఎండి చెప్పలేదా అని ప్రశ్నించారు. టీడీ పీ నుంచి సీనియర్ నేతలైన కేసీఆర్, ఇంద్రారెడ్డి తదితరులను బయటకు వెళ్లగొట్టింది చంద్రబాబే అని మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ బోధించిన రాజకీయ శిక్షణ తరగతులకు బాబు హాజరు కాలేదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు భరోసా కల్పించేలా అక్కడ ఉండకుండా, హైదరాబాద్‌లో కొత్త ఇల్లు ఎందుకు నిర్మించుకున్నట్లు అన్ని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగై తదని, ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు చాలని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎలా ఆడుకోవాలో వాళ్లిధ్దరికీ బాగా తెలుసన్నారు. ఆ పార్టీలో అంతా పిక్పాకె ట్ బ్యాచ్, లూటీ బ్యాచ్ ఉందని విమర్శించారు.