ఆయనో అబద్ధాల పుట్ట
సాక్షి, బళ్లారి : ‘ఈ దేశంలో అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధరామయ్య ఒక్కరే’ అని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బళ్లారి తాలూకాలోని బెళగళ్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అబద్ధాలతో రాష్ర్ట ప్రజలను సీఎం సిద్ధరామయ్య మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ హయాంలో చేపట్టిన పనులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ యడ్యూరప్ప, తాను ప్రవేశపెట్టిన పలు పథకాలకు సిద్ధరామయ్య ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధనాలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని అన్నారు. అయితే ప్రజాబలంతో ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు ప్రాంతాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సామాన్య కార్యకర్తగా ఉన్న ఓబులేసును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ అభ్యర్థి ఓబులేసు, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.