'రైతు ఆత్మహత్యలపై ఏం చేస్తారో చెప్పండి'
న్యూఢిల్లీ: అత్యంత తీవ్రమైన అంశంగా మారిన రైతు ఆత్మహత్యల నిరోధానికి ఏం చేస్తారో చెప్పాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా ఈ నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.
రైతులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి, వాటిని నిరోధించడానికి ఒక పాలసీని తీసుకురావాలని సూచించారు. గుజరాత్లో రైతుల దీనిస్థితిపై ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన పాలసీని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే, కేవలం గుజరాత్ అనే కాకుండా ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం కావడంతో ఈ పిటిషన్ పరిధిని ధర్మాసనం విస్తరించింది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, అలాగే రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు వివరించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని తెలిపారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, కేంద్రం వాటికి తగిన సహకారం అందించాలని సూచించారు. అలాగే రైతు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను పరిష్కరించే విధానాలతో ముందుకు రావాలని ఆదేశించారు.