జగ్గయ్యపేటలో పట్టపగలు చోరీ
జగ్గయ్యపేట : ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి వచ్చేలోపు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో ఉడాయించారు. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలోని సీతారాంపురంలో బుధవారం జరిగింది. కాలనిలోని జి. వెంకటేశ్వర్లు విజయడైరీలో పని చేస్తున్నాడు. ఈ రోజు బుధవారం కావడంతో ఇంటికీ తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బాబా గుడికి వెళ్లారు.
తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. దాంతో వెంకటేశ్వర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. రూ. 4 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు బాధితుడు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. నెలరోజుల వ్యవధిలో పట్టణంలో ఇలాంటి చోరీలు 10కి పైగా జరిగిన పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.