జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ అమ్రపాలి
అంబేద్కర్ భవన్లో జగ్జీవన్ రాం జయంతి వేడుకలు
నివాళులర్పించిన అధికారులు, వివిధ సంఘాల నాయకులు
హన్మకొండ : దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి సూచించారు. చేస్తున్న పనిలో అంకితభావం చూపించి పేద, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అమ్రపాలి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ముందుగా బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు అధికారులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ దాదాపు యాభై ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగిన జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా కొనసాగిన కాలంలో పాకిస్తాన్‌పై యుద్ధం జరగగా ఆయన ఎంతో సమర్థంగా యుద్ధాన్ని ఎదుర్కొన్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వచ్చిన కరువు కాటకాల నుంచి సామాన్య ప్రజలు, రైతులను ఆదుకొనేందుకు గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చారన్నారు. మహనీయుల జయంతులు ఏప్రిల్‌లో వస్తాయని.. ఈ మేరకు విద్యార్థులు ఏదో పనిని అసాధారణంగా చేసి చూపించాలని సూచించారు. తన విషయానికొస్తే ఈ నెలలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గోడలపై పెయింటింగ్ వేయించనున్నట్లు కలెక్టర్‌వెల్లడించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహ స్థాపనకు తన ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
అర్హులకు పథకాలు చేరాలి
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరినప్పుడే జగ్జీవన్ రామ్ వంటి మహనీయులకు నివాళులర్పించినట్లవుతుందని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జగ్జీవన్‌రామ్ కేవలం దళితులకే కాక పేద ప్రజలందరికి సహాయం చేశారని అన్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ దళితులైన మిగిలినవారైనా ఆత్మన్యూనతాభావం విడనాడాలని సూచించారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ ఇచ్చిన శక్తి, హక్కులను వదలకుండా విజ్ఞానం పెంపొందించుకుని సమాజానికి సేవ చేసే విధంగా ఎదగాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.దయానంద్, డీఆర్వో కె.శోభ, కార్పొరేటర్లు జోరిక రమేష్, డిన్నా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్, వివిధ సంఘాల నాయకులు బొమ్మల కట్టయ్య, మంద కుమార్ పి.జయాకర్, శ్రీఖర్, ఎల్లయ్య, పరంజ్యోతి, నర్సయ్య, సారంగపాణి, వివిధ శాఖల అధికారులు శంకర్, వెంకట్‌రెడ్డి పాల్గొనగా మగ్దుం వ్యాఖ్యతగా వ్యవహరించారు.