జాతీయ పక్షులను చంపితే జైలుకే...
జగిత్యాల : జాతీయపక్షి నెమలిని చంపిన కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాల మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ రమేష్ సోమవారం తీర్పునిచ్చారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జిల్లాలో జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతిరెడ్డి తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం తారకరామనగర్కు చెందిన వనం రవి, కుంభం పోచయ్య కూలీలు. వీరు మల్యాల మండలం రాజారాం గ్రామ సమీపంలోని రామస్వామి గుట్టపై వన్యప్రాణుల కోసం వలలు ఏర్పాటు చేశారు. 2011 ఆగస్టు 19 వలల్లో రెండు నెమళ్లు చిక్కాయి. రవి, పోచయ్య ఆ నెమళ్ల ఈకలు పీకి, అమ్మేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమ్మిరెడ్డి, వెల్దుర్తి బీట్ ఆఫీసర్ రఘుపతి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇది పసిగట్టిన రవి, పోచయ్య నెమళ్లను వదిలేసి పారిపోయూరు. అటవీ అధికారులు నెమళ్లను స్వాధీనం చేసుకుని వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసేలోపే అవి మృతి చెందాయి. చనిపోయిన నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించి, రవి, పోచయ్యపై జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రవి, పోచయ్యలకు శిక్ష విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.