‘ల్యాండ్ బ్యాంకు’ సిద్ధం
జగిత్యాల : ప్రతీ జిల్లాలో ఫారెస్ట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. అంతరించిపోతున్న అడవుల స్థానంలో కొత్తగా గ్రీనరీ అభివృద్ధితోపాటు పలు చోట్ల పరిశ్రమల కోసం తీసుకునే అటవీశాఖ భూముల స్థానంలో ఈ భూముల ను అటవీశాఖకు అప్పగించనున్నారు. ల్యాండ్ బ్యాం కు ఆఫ్ ఫారెస్ట్ కోసం అవసరమైన భూమి సేకరించాలని సర్కార్ జిల్లా అధికారులను ఆదేశించింది.
రెండు రకాలుగా...
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, పరిశ్రల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం భూ సేకరణ జరపాలని ఆదేశించింది. జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాల భూమిని సేకరించారు. జిల్లాలో 3,69,311 ఎకరాల భూమిని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. ఏ, బీ కేటగిరీ భూములను పరిశ్రమలు, భూపంపిణీకి తీసుకోనున్నారు. సీ, డీ భూముల్లో అడవులు పెంపకానికి వినియోగించాలని అలోచిస్తున్నారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలు, మంచినీటి పథకాలకు, రోడ్ల విస్తరణకు పలు ప్రాంతాల్లో ఫారెస్టు భూములు తీసుకునే అవకాశముంది. తీసుకున్న ఆటవీశాఖ భూముల స్థానంలో సీ, డీ కేటగిరీ భూములను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో సీ, డీ కేటగిరీ భూములివి...
జిల్లాలో ‘సీ’ కేటగిరీలో 28,430 ఎకరాలు, ‘డీ’ కేటగిరీలో 3,13,220 ఎకరాలు సేకరించారు. ప్రధానంగా ‘డీ’ కేటగిరీలో గుట్టలు, బండరాళ్లు ఉన్న భూమిగా ఉంది. ‘సీ’ కేటగిరీలో భూమితోపాటు బండరాళ్లు ఉన్నట్లుగా అధికారులు రికార్డులు తయారుచేశారు. జిల్లాలో అవసరమైతే అటవీశాఖకు కేటాయించడానికి సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ,7406 ఎకరాలు, జగిత్యాలలో 1,20,390 ఎకరాలు, మంథనిలో 32,352 ఎకరాలు, పెద్దపల్లిలో 61,894 ఎకరాలు, కరీంనగర్లో 29,965 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు.
మొక్కల పెంపకానికి...
రాబోయే సంవత్సరం నుంచి హరితతోరణం కింద లక్షలాది మొక్కలను పెంచడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో మొక్కలు పెంపకానికి గ్రామాలతోపాటు గ్రామ శివారుల్లో ఉన్న గుట్టలు, ఆడవులప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా మొక్కలు పెంచడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశారు. ఖాళీస్థలం ఎక్కడున్నా మొక్కలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అధికంగా జగిత్యాల డివిజన్లోనే...
జిల్లాలో ఎక్కువగా సీ, డీ కేటగిరీలకు చెందిన భూమి జగిత్యాల రెవెన్యూ డివిజన్లోనే ఉంది. ఈ మేరకు డివిజన్లో ‘సీ’ కేటగిరీలో 14,176 ఎకరాలు, డీ కేటగిరీలోలో 1,43,616 ఎకరాల భూమి డివిజన్లో ఉంది. ఈ భూముల్లో అటవీశాఖకు కేటాయించడానికి అనువుగా 14,300 ఎకరాల భూమిని తొలి విడతగా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్డీవో ఎస్.పద్మాకర్ జిల్లా కలెక్టర్కు నివేదిక తయారు చేశారు.