విజ్ఞానశాలలు
బాలల దినోత్సవం నాడు నిండు వెన్నెలలో ఆడుకొమ్మని చిన్నారులకు సూచించిన భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఆ బాలల భవిష్యత్తులో పండు వెన్నెల నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తి రేకెత్తించేలా శాస్త్రవేత్తలను బడిబాట పట్టిస్తామన్నారు. సైంటిస్టులు, వివిధ రంగాల్లో ప్రముఖులతో విద్యార్థులకు జీవితపాఠాలు చెప్పిస్తామన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయంపై పాజిటివ్‌గా స్పందించిన నారాయణగూడలోని జాహ్నవి విమెన్స్ కాలేజ్ విద్యార్థినులు.. క్యాంపస్ కబుర్లలో దానిపై విస్తృతంగా చర్చించారు.
సరిత: ప్రధాని మోదీని ముందుగా అందరం మెచ్చుకోవాలి. ఎందుకంటే శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు పాఠశాలలకు, కళాశాలలకు వచ్చి పాఠాలు చెప్పాలన్న ఆలోచన వచ్చినందుకు.
పూజ అగర్వాల్: అవును.. ఇప్పటి వరకూ ఏ నాయకుడికి రాని ఆలోచన ఇది.
నజియా సుల్తానా: అంటే.. ఆచరణ కష్టమని ఎవరూ ఇలాంటి ఆలోచన చేయలేదనుకుంటాను.
దాక్షాయణి: నిజమే.. కాని మంచి పనులెపుడూ కష్టంగానే ఉంటాయి. అలాగని మొదలుపెట్టకుండా ఉంటామా..?
నాజియా సుల్తానా: అవును. ఇప్పటికైనా ఇలాంటి ఐడియా రావడం మంచిది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. శాస్త్రవేత్త వచ్చి పాఠాలు చెబితే.. ఎన్నో ప్రాక్టికల్ విషయాలు తెలుస్తాయి.
దాక్షాయణి: వారు చెప్పే పాఠాల సంగతి పక్కన పెట్టు సుల్తానా.. ముందుగా వారిని చూసే అవకాశం దొరుకుతుంది.
మౌనిక: సైంటిస్టులు.. ఇతర రంగాలలోని నిపుణుల గురించి వినడమే కాని వారిని నేరుగా చూసి మాట్లాడే అవకాశం రాదు. విద్యార్థులుగా ఉన్నప్పుడే అలాంటి వారి మాటలు వింటే మన ఫ్యూచర్‌కి మంచి పునాదులు పడే అవకాశం ఏర్పడుతుంది.
తులసి: కచ్చితంగా.. ఒక డాక్టర్ తన ప్రొఫెషన్లో ఎదుర్కొన్న అనుభవాలను కాలేజ్ విద్యార్థులకు పాఠాలుగా చెబితే దానికి మించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏముంటుంది చెప్పండి.
రేవతి: శాస్త్రవేత్తలనే కాదు.. అన్ని రంగాలకు చెందిన నిపుణులు విద్యార్థులకు పాఠాలు చెప్పాలి.
మౌనిక: నీకు తెలుసా రేవతి.. మనకు గట్టిగా అంటే పది ఫ్రొఫెషన్లకంటే ఎక్కువ తెలియదు. మరెన్నో రంగాలు ఉన్నాయి. వాటిలోకి ఎలా వెళ్లాలి. వెళితే భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలపై మినిమమ్ అవేర్నెస్ లేదు.
రేవతి: ఎంతసేపు డాక్టర్, ఇంజనీర్ జపం తప్ప.. మరో మాట లేదు. మనకు గుర్తింపు తెచ్చే రంగాలు చాలా ఉన్నాయి. వాటిని ఎంచుకున్నవారు విదేశాలకు వెళ్లి పేరు తెచ్చుకుంటున్నారు. మనకేమో వాటి గురించి అసలు తెలియదు.
దాక్షాయణి: అందుకే అన్ని రంగాల నిపుణులను పాఠశాలలకు, కళాశాలలకు రప్పించాలి.
నాజియా సుల్తానా: రోజుల తరబడి పాఠాలు చెప్పక్కర్లేదు. వారి వీలునుబట్టి, వారుండే ప్రాంతాన్ని బట్టి కనీసం ఓ నాలుగైదు క్లాసులు చెప్పినా చాలు స్టూడెంట్స్ తలరాతలు మారతాయి.
మరియా: ఎంత సేపు బుక్స్, ఉపాధ్యాయులే కాకుండా భవిష్యత్తులో తామెలా ఉండాలో ఊహించుకోడానికి అప్పుడప్పుడు కొందరు నిపుణులు మా దగ్గరికి రావడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది.
దివ్య: ఇంట్లో వారికి కూడా ఫలానా రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో మన పేరెంట్స్‌కు వివరించొచ్చు కూడా.
పూజ అగర్వాల్: నాలెడ్జ్ సంగతి పక్కన పెడితే మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలకు పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు వెళితే జరిగే మేలు మరొకటి ఉంది. ఆ స్కూల్స్‌లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది.
సఫియా: ఎక్కడినుంచో ఒక శాస్త్రవేత్త ఫలానా గ్రామంలోని పాఠశాలకు వస్తున్నారంటే అక్కడ కనీస సౌకర్యాల గురించి ఆలోచిస్తారు. అవసరమైతే ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు కూడా.
తులసి: ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రధానికి వచ్చిన ఆలోచన అన్ని విధాలా ఉపయోగకరంగానే ఉంది.
సరిత: మన దేశంలో ఆలోచనలకు కొదవలేదు. ఆచరణలోకి వచ్చిన రోజే మనకు నిజమైన ఆనందం. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుందాం.
- భువనేశ్వరి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్