'గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదు'
రాజమండ్రి: గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్కు తెలియదని తాజా మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల్లో నెగ్గిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకే జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినందుకే సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ మాట్లాడారు.
పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్) కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని ఎవరు సిఫారసు చేశారని ప్రశ్నించారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని నిలదీశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఎలా ఆమోదిస్తారన్నారు. తెలుగుజాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందన్నారు. అయితే విభజన పూర్తిగా అయిపోలేదన్నారు.
ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్కు గుణపాఠం కావాలన్నారు. తనకు ప్రజలే బీఫారం ఇస్తారని కిరణ్ అన్నారు. పదవి వదిలేసి తెలుగు ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర పార్టీ జెండాను కిరణ్ ఆవిష్కరించారు. లేత పసుపుపచ్చ, పచ్చరంగులో ఉన్న జెండా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పటం ఉంచారు.