దటీజ్ అర్జున్!
చెన్నై: కోలీవుడ్ యాక్షన్ హీరో అర్జున్ తన సినిమాలలోనే కాకుండా, నిజజీవితంలో కూడా దేశభక్తిని చాటుకున్నారు. ఈ హీరోకి దేశభక్తి ఎంత అనేది ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రాలే సాక్ష్యం. తాజాగా మరోసారి నిరూపించుకున్నారు. కథ, కథనం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టి అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జై హింద్ -2' విద్య ప్రాముఖ్యత గురించి ఆవిష్కరించే ఈ చిత్రంలో ఆయనకు జంటగా సుర్విన్ చావ్లా, సిమ్రాన్ కపూర్లు నటిస్తున్నారు. నవ సంగీత దర్శకుడు అర్జున్ జన్య స్వరాలందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది.
చిత్ర ఆడియోను దర్శకుడు బాలా ఆవిష్కరించగా తొలి ప్రతిని ఇటీవల యుద్ధంలో మరణించిన మేజర్ ముకుంద్ కూతురు హర్షియ, చిత్రంలో నటించిన బాలతార యునినా అందుకున్నారు. ముందుగా మేజర్ ముకుంద్ కుటుంబ సభ్యులను అర్జున్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైహింద్-2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర టైటిల్‌కు తగ్గట్టు నిర్వహించాలని ఆశించినప్పుడు రియల్ హీరో మేజర్ ముకుంద్ గుర్తుకొచ్చారని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మేజర్ కుటుంబాన్ని ఆహ్వానించి వారి సమక్షంలో జైహింద్-2 చిత్ర ఆడియోను విడుదల చేయాలని భావించానన్నారు. ఇందుకు తొలుత వారు అంగీకరించకపోయినా ఆ తరువాత ఒప్పుకున్నారని తెలిపారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని ఈ వేదికపైకి ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరిందని అర్జున్ వ్యాఖ్యానించారు.
మేజర్ చంద్రకాంత్ : మేజర్ ముకుంద్ తండ్రి వరదరాజన్ మాట్లాడుతూ అర్జున్ నటించిన జెంటిల్మెన్ చిత్రం చూసి ఆయన అభిమాని అయిన తన కొడుకు ముకుంద్ యాక్షన్ చిత్రాలను ఇష్టంగా చూసేవాడన్నారు. ఇప్పుడీ జైహింద్-2 చిత్రాన్ని చూడటానికి తను లేకపోయినా తామీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అర్జున్ను యాక్షన్ కింగ్ తదితర బిరుదులతో పిలుస్తారని అయితే తానిప్పుడాయన్ని మేజర్ చంద్రకాంత్‌గా వ్యాఖ్యానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్లు సుర్లిన్ చావ్లా, సిమ్రాన్ కపూర్, నటుడు మనోబాలా, నిర్మాత కలైపులి ఎస్.థాను, దివంగత దర్శక నిర్మాత రామనారాయణన్ కొడుకు మురళి పాల్గొన్నారు.
**