జైలు భయంతో ఆత్మహత్య
చెన్నూర్రూరల్: జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని కత్తెరసాల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కత్తెరసాల గ్రామానికి చెందిన పంచిక మల్లయ్య(50)కు కరీంనగర్ జిల్లా మంథని మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య లక్ష్మి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి మల్లయ్య ఒంటరిగా ఉంటున్నాడు. భార్య తన ఇంటికి రావాలంటూ మల్లయ్య పలుమార్లు అత్తవారింటికి వెళ్లి తరచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలో మూడేళ్ల క్రితం మల్లయ్య తన బావమరిదితోపాటు తోడల్లుడుని హత్య చేశాడు. దీంతో అతడిపై కరీంనగర్ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మూడు నెలలపాటు కరీంనగర్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. హత్య కేసుల్లో మల్లయ్య కోర్టు పేషీలకు సరిగా హాజరు కాలేదు. ఈ కారణంగా తనను జైల్లో పెడుతారని, వారెంట్లు వస్తాయని బంధువులు, గ్రామస్తులతో చెబుతూ భయాందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మల్లయ్య ఆదివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. బంధువులు సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ శ్రీలత తెలిపారు.