భార్య మృతి కేసులో భర్తకు జైలు శిక్ష
గుంటూరు లీగల్ : దుర్వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన కేసులో నిందితుడు బండి సాంబయ్యకు మూడేళ్లు జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి.ఆనంది సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన బండి సాంబయ్యకు గుంటూరు నగరంలోని సంజీవయ్యనగర్కు చెందిన స్వాతితో సంఘటనకు ముందు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి సంతానం. అనంతరం సాంబయ్య మద్యానికి బానిసై పుట్టింటి నుంచి అదనంగా కట్నం తీసుకురావాలని భార్యను వేధింపులకు గురిచేసేవాడు. 2015 డిసెంబర్ 23న రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన సాంబయ్య పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని ఆమెను వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక స్వాతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి మంటలను ఆర్పి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ 2016 జనవరి 14న మృతి చెందింది. ఈ సంఘటనపై పెదకాకాని పోలీసులు సాంబయ్యపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆనంది తీర్పుచెప్పారు. ఏపీపీ ఉషాకిరణ్రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించగా, అప్పటి సీఐ కే.శేషారావు కేసు దర్యాప్తు చేశారు.