సింగరేణి వెలుగుల రికార్డులు
విద్యుత్ ఉత్పత్తితో పాటు బొగ్గు తవ్వకాలు, రవాణాల్లోనూ రికార్డు
సింగరేణి చరిత్రలో మంచిర్యాల జిల్లాకు ప్రత్యేక స్థానం
బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్య సాధన దిశగా సింగరేణి కార్మికులు
మంచిర్యాల : జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) రాష్ట్రానికి వెలుగులు పంచడంలో రికార్డు సాధించింది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి రూ.8,500 కోట్ల వ్యయంతో నిర్మించిన థర్మల్ ప్రాజెక్టు.. ఉత్పత్తి ప్రారంభించిన ఏడు నెలల్లోనే ఏకంగా 1980 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. పూర్తిగా రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసమే ఉద్దేశించబడిన ఈ ప్రాజెక్టు నుంచి గజ్వేల్‌లోని పవర్‌గ్రిడ్‌కు ఏకంగా 1821 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అనుసంధానం చేసి రికార్డు సృష్టించింది. జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులో మూడు ప్లాంట్ల నుంచి 600 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి లక్ష్యం కాగా, ప్రస్తుతం రెండు ప్లాంట్లలో ఉత్పత్తి జరుగుతోంది. 2015 జూన్ నెల నుంచి ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభమైంది. 28 మిలియన్ యూనిట్ల సగటుతో ప్రతిరోజూ ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ రాష్ట్ర అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.
తెలంగాణ జెన్కోకు విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని 11 యూనిట్ల నుంచి 1720 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుండగా, రామగుండం థర్మల్ ప్రాజెక్టులోని పురాతనమైన ఒక ప్లాంట్ నుంచి 63.5 మెగావాట్లు జెన్కోకు వెళుతోంది. ఇక రెండు ప్లాంట్లతో 1200 మెగావాట్ల కెపాసిటీతో జూన్‌లోనే ఉత్పత్తి ప్రారంభించిన జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏడు నెలల కాలంలోనే ఏకంగా 1980 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించడం గమనార్హం. కాగా.. ఇకపై కూడా పూర్తి సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించి, రాష్ట్ర అవసరాలకు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి సూచించారు.
డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణాల్లో ఆల్‌టైం రికార్డు
మంచిర్యాల జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతుంటే.. బొగ్గు తవ్వకాలు, రవాణాల్లో కూడా ఈ సంస్థ డిసెంబర్ నెలలో రికార్డు సాధించింది. ఇందులో సైతం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), మందమర్రి నుంచి 164 రైల్వే వ్యాగన్ బండ్లు(రేకులు) లోడ్ చేయడం గమనార్హం. డిసెంబర్ నెలకు నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 52.78 లక్షల టన్నులు కాగా, కంపెనీ 59.52 లక్షల టన్నులు (113 శాతం) ఉత్పత్తి చేసింది. సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు గత డిసెంబర్ 2015లో సాధించిన 57.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే అత్యధిక రికార్డు కాగా, 2016 డిసెంబర్లో 59.52 లక్షల టన్నులతో పాత రికార్డులను అధిగమించింది. అలాగే బొగ్గు రవాణాలో కూడా 2015 డిసెంబర్ (54.42 లక్షల టన్నులు) కన్నా 2016 డిసెంబర్లో 59.84 టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. రైల్వే వ్యాగన్ల రేకులు లోడ్ చేయడంలో మంచిర్యాల, బెల్లంపల్లితో పాటు రుద్రంపూర్ (కొత్తగూడెం) 207 రేకులు, జీడీకే 1–129, ఓసీ–3 155 రేకులు ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా సింగరేణి కార్మికులు ఈ మూడు నెలలు శ్రమించాలని ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ సూచించారు.