పాకిస్తాన్ ఇక ఏకాకే!?
ఇస్లామాబాద్/వాషింగ్టన్ : అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై భారత్ మరోమారు అత్యంత కీలక దౌత్య విజయాన్ని సాధించింది. భారత్‌పై ఉగ్రదాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని అమెరికా తేల్చింది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న లష్కరే తోయిబాపై ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది.
అందులో భాగంగా అమెరికన్ కాంగ్రెస్ కొత్తగా రూపొందించిన నేషనల్ ఢిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2018లో లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేలా అమెరికా కొత్తగా చట్టాన్ని రూపొందించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో.. ఉగ్రవాదంపై పోరు చేస్తున్న పాకిస్తాన్ కూడా ఈ సంస్థను ఉగ్రసంస్థగానే పరిగణించాల్సి ఉంటుంది.
ఉగ్రవాదంపై పోరుగలో భాగంగా పాకిస్తాన్‌కు అమెరికా భారీగా ఆర్థిక సహకారం అందిస్తోంది. గతంలో 350 మిలియన్ డాలర్లు ఉన్న ఆర్థిక సహకారం.. ఈ ఏడాది 700 మిలియన్ డాలర్లకు అమెరికా పెంచింది. హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబాలను నిర్వీర్యం చేసే క్రమంలో పాకిస్తాన్ వెనకడుగు వేస్తే.. భవిష్యత్‌లో అమెరికా నుంచి ఎటువంటి నిధులు అందవని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది భారత్ విజయం
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన బ్రిక్స్, ఇతర అంతర్జాతీయ వేదికలపై లష్కరే తోయిబా, దాని అధిపతి హహీజ్ సయీద్‌పై భారత్ పోరుబాట పట్టింది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ పెద్ద పోరాటమే చేసింది. చైనా అడ్డుపడకపోయి ఉంటే.. మసూద్ అజర్‌ని ఈ పాటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచం గుర్తించేది.