అనుమతివ్వండి అంతు తేలుస్తాం..!
జైషే ఇ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ ప్రభుత్వంపై మండి పడ్డాడు. కాశ్మీర్ ను అధీనంలోకి తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని, నిర్ణయాత్మక లోపాలే అందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్క అవకాశం ఇస్తే భారత్ లో కల్లోలం సృష్టిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వాన్నికోరాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిహాదీలను కోల్పోయే పరిస్థితి ఇకపై ఎదురు కాకూడదని మసూద్ ప్రకటించాడు. జిహాదీ విధానాలు దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తాయంటూ పాకిస్థాన్ ప్రభుత్వానికి నేరుగా సూచించాడు. నిర్ణయాలను తీసుకోవడంలో ప్రభుత్వం ఎంతో వెనుకబడుతోందని, భారతదేశానికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను అమలు చేసేందుకు అనుమతించాలని కోరాడు. జైషే వార పత్రిక 'అల్ ఖ్వాలమ్' తాజా సంచికలో మసూద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 'పాకిస్థాన్ ప్రభుత్వం కొద్దిపాటి ధైర్యం చూపితే'.. అంటూ అజహర్ అల్ ఖ్వాలమ్ పత్రిక ముందు పేజీలో వ్యాసం రాశారు.
ముజాహిదీన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే... కాశ్మీర్ సమస్య, నీటి వివాదం వంటివన్నీ పూర్తి స్థాయిలో ఒకేసారి పరిష్కరించుకునే అవకాశం ఉందని అజహర్ అభిప్రాయ పడ్డాడు. 1971 నాటి చేదు జ్ఞాపకాలను తుడిచిపెడుతూ, 2016లో విజయవంతమైన భావోద్వేగాలను మనసునిండా నింపుకోవచ్చని సూచించాడు. భారతదేశం అఖండ భారత్ నిర్మాణానికి ప్రయత్నిస్తోందని, అందుకే అణువణువునా జిహాదీలను అణచివేయాలని చూస్తోందని చెప్పాడు. వారి ఆశలను కూకటి వేళ్ళతో తుంచేందుకు జిహాదీ విధానం ఎంతగానో సహకరిస్తుందని సలహా ఇచ్చాడు. పఠాన్ కోట్, ఉడీ దాడులతో భారత్ తన సైనిక పరాక్రమాన్ని గుర్తు చేసిందన్నాడు. పాకిస్థాన్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఈ విషయం కాశ్మీర్ పరిస్థితి చూస్తే తెలుస్తోందన్నాడు.