అణుపార్కు కాదది.. ఆటంబాంబు
రణస్థలం : అణుపార్కు పెట్టడమంటే ఆటంబాంబు పెట్టడమేనని జైతాపూర్ అణువిద్యుత్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు డాక్టర్ వివేక్ మాంటోరి అన్నారు. ప్రతిపాదిత కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రభావిత గ్రామాలైన కొవ్వాడ, కోటపాలెం, అల్లివలస గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఒక అణు రియాక్టర్ నుంచి ఏడాదికి 50 టన్నుల అణువ్యర్థాలు(ప్లుటోనియం) విడుదలవుతాయని, ఇది వెయ్యి ఆటంబాంబులతో సమానమన్నారు. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం, మత్స్యసంపద, తీరప్రాంతం మొత్తం అణుధార్మికత ప్రభావంతో మొత్తం విషతుల్యమై ప్రజల జీవనమే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జైతాపూర్‌లో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారని, అదే స్ఫూర్తితో ఇక్కడ పోరాడాలని పిలుపునిచ్చారు.
కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటై.. అందులో ఎటువంటి ప్రమాదం జరిగినా అటు ఒడిశా నుంచి ఇటు కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనమైపోతాయని హెచ్చరించారు. కాగా కొవ్వాడ ప్రాంతం భూకంపాల జోన్లో ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఇఫ్ ఇండియా చెప్పిన విషయాన్ని మాంటోరి గుర్తు చేశారు. ఈ అణుపార్కును దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒబామా పర్యటన సందర్భంగా అమెరికా సరఫరా చేసే రియాక్టర్ల వల్ల ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే బాధ్యత తీసుకోవడానికి ప్రధాని మోదీ ఇటీవలి ఒబామా పర్యటన సందర్భంగా అంగీకరించడం భారత సార్వభౌమత్వానికే ప్రమాదమన్నారు.
సీఐటీయు జిల్లా ప్రధాన కారర్యదర్శి డి.గోవిందరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అణువిద్యుత్‌కు అనుకూలంగా జీవోలు జారీ చేయడం ప్రజలను మోసగించడం కాదా? అని ప్రశ్నించారు. అణుపార్కు రద్దు చేసే వరకు ప్రజల మద్దతుతో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సంజీవని పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కూన రాము, సీఐటీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, సీహెచ్ అమ్మినాయుడు, అరబిందో, శ్యాంపిస్టన్స్, యూబీ తదితర సంస్థల కార్మిక సంఘాల నాయకులు కె.గురినాయుడు, ఎస్.సీతారామరాజు, సీహెచ్ సురేష్‌కుమార్, ఎం.శ్రీనివాసరావు, వి.లక్ష్మణరావు, జె. శ్యామలరావు, ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.