ఇదేనా ‘ఆదర్శం’?
- అధ్వానంగా మోడల్ స్కూల్
- ఫ్లోరింగ్ లేక దుమ్ముతో ఇబ్బందులు
- కరెంటు లేక వృథాగా కంప్యూటర్లు
- ఐదేళ్లయినా అసంపూర్తిగానే
- నిధులు లేక నిలిచిన పనులు
- నేడు కమిషనర్ వద్ద సమస్యలపై సమావేశం
నర్సాపూర్: జక్కపల్లి ఆదర్శ పాఠశాల నిర్వహణ అధ్వానంగా మారింది. ఐదేళ్లయినా భవనం పనులు పూర్తికాలేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరింగ్ లేని గదుల్లో తరగతులు కొనసాగించడంతో విద్యార్థులు దుమ్ముతో అవస్థలు పడుతున్నారు. మండలంలోని జక్కపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఉంది.
ఇందులో సుమారు 555 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి. 2011 జూన్‌లో ఈ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం హాస్టల్ భవనానికి రూ.1.28 కోట్లు మంజూరు కావడంతో అప్పటి మంత్రి సునీతారెడ్డి 24 ఆగస్టు 2012 శంకుస్థాపన చేశారు. ఐదేళ్లయినా నిర్మాణం పూర్తి కాలేదు. అసంపూర్తి భవనంలోనే రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో ఫ్లోరింగ్ పనులు కాలేదు. కిటికీలకు తలుపులు బిగించాల్సి ఉంది. కరెంటు వైరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు ఉన్నంత వరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఆపై పనులు నిలిపివేశారు.
అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
మొదటి అంతస్తులోని గదులు, వరండాలో ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ చేయనందున దుమ్ము లేచి పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు ఎలర్జీ సమస్యతో సతమతమవుతున్నారు. విద్యుత్ సరఫరా లేక కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్ నిరుపయోగంగా ఉన్నాయి.
బస్సులు లేక ఇబ్బందులు...
జక్కపల్లి పాఠశాలకు విద్యార్థులు ఆయా గ్రామాలతోపాటు నర్సాపూర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నర్సాపూర్ నుంచి ఉదయం రెండు బస్సులనే అధికారులు నడుపుతున్నారు. బస్సుల కోసం గతంలో నర్సాపూర్‌లో రాస్తారోకో చేసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలోనే ఉన్నతాధికారులకు నివేదించినట్టు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు.
నేడు కమిషనర్ వద్ద సమావేశం..
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యా శాఖ కమిషనరేట్‌లో జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతన్నాయి. శనివారం మెదక్ జిల్లాలోని 24 ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై సమీక్ష జరగనుంది. రాష్ట్ర కమిషనర్ కిషన్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషన్ మెదక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిల్‌కుమార్‌తోపాటు కింది స్థాయి అధికారులు , ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొననున్నారు.