jalagam Venkata Rao
-
మైనింగ్ టూరిజంతో కొత్తశోభ
త్వరలో రాంపురం గనికి అనుమతులు! రుద్రంపూర్ (కొత్తగూడెం): మైనింగ్ టూరిజం ఏర్పాటుతో కొత్తగూడెం నూతన శోభను సంతరించుకోనుంది. ఏరియా పరిధిలోని 5 ఇన్‌క్లైన్ గని ప్రాంతంలో మైనింగ్ టూరిజం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సింగరేణి పరిణామక్రమాన్ని తెలిపేందుకు ఒక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఐదు లేక ఆరు ఎకరాల స్థలం కావల్సి ఉంటుంది. గురువారం అసెంబ్లీలో మైనింగ్ టూరిజం ఏర్పాటుపై సీఎం సానుకూలంగా స్పందించడంతో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్థలాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. ఏరియాలోని ఎంవీటీసీ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉన్న స్థలాన్ని టూరిజం కోసం ఇప్పటికే అధికారులు పరిశీలించారు. అలాగే ఏరియాలోని రాంపురం భూగర్భ గనిలో సుమారు 40 మిలియన్ టన్నులు బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ఈగని కి సంబంధించిన దాదాపు అన్ని సర్వేలు పూర్తయ్యాయి. అటవీ, ఎన్విరాల్మెంట్ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ చర్చల్లో 12 నూతన భూగర్భ గనుల ఏర్పాటు చేయనున్నుట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ కొత్తగనుల్లో రాంపురం ఉంటుందని అధికారులు భిప్రాయపడుతున్నారు. ఈ గని ద్వారా సుమారు వెయ్యి మంది కార్మికులకు ఉపాధి లభించనుంది. -
తుమ్మల, జలగం వర్గాల బాహాబాహీ
పోటాపోటీగా స్వాగత తోరణాలు తుమ్మల ఫ్లెక్సీలను చింపిన జలగం వర్గీయులు కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ సెక్రటరీ(సీఎంవో) జలగం వెంకటరావు అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యూయి. కొత్తగూడెంలో శుక్రవారం జలగం వర్గీయులు తుమ్మల ఫ్లెక్సీలను చింపివేయడంతో వివాదం రాజుకుంది. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం, మణుగూరులో విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సీఎం రోడ్డుమార్గంలో ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం రానుండడంతో ఇరువర్గాలకు చెందిన పార్టీ నేతలు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయమే మంత్రి తుమ్మల వర్గీయులు పాల్వంచలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపారు. ఇది జలగం వర్గీయుల పనేనని మంత్రి వర్గీయులు ఆందోళన చేస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అటు కొత్తగూడెంలోనూ తుమ్మల వర్గీయుల ఫ్లెక్సీలను జలగం వర్గీయులు తొలగించారు. దీంతో తుమ్మల వర్గీయులు మరోమారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. తిరిగి ఆ ఫ్లెక్సీలనూ జలగం వర్గీయులు చించి వేస్తుండటంతో, అడ్డుకునేందుకు తుమ్మల వర్గీయులు యత్నించారు. అనంతరం స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు తుమ్మల వర్గీయులైన కాపా కృష్ణమోహన్‌తోపాటు పలువురు నాయకులు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న జలగం వర్గీయులు తుమ్మల వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు పరస్పర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. -
తుమ్మల, జలగం వర్గీయుల మధ్య ఘర్షణ
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులకు కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు వర్గీయులకు మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. తుమ్మల ఫ్లెక్సీలను జలగం వర్గీయులు తొలగించడంతో తుమ్మల వర్గీయులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తుమ్మల వర్గీయులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో జలగం వర్గంపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. -
పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన టీఆర్ఎస్కు చెందిన కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రి హోదా కలిగిన ఈ పదవి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. వెంకటరావు బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాకు చెందిన ఇద్దరు నెలలోపే అమాత్యులుగా బాధ్యతలు స్వీకరించినట్లయింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంకటరావును జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై అవగాహన కలిగిన వెంకటరావు ఈ హోదాలో పలు కీలక ప్రభుత్వ శాఖలను పర్యవేక్షించే అవకాశం రావడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. -
టీఆర్ఎస్లో ఆంధ్రోళ్ల పెత్తనం..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతలు, వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలు దిక్కయ్యారు. మరోపక్క స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేత జలగం వెంకట్రావు అనుచరులు చాలా మంది ఇప్పటికే ఆయన ప్రచారంలో పాల్గొనేందుకు కొత్తగూడెం తరలివెళ్లారు. దీంతో స్థానిక అభ్యర్థి ప్రచారంలో పాల్గొనేందుకు కార్యకర్తలే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలగం వెంకటరావు టీఆర్ఎస్లో చేరకముందే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిలో చాలా మంది టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన వారు, ఏ పార్టీలో స్థానం దక్కని వారు జలగం బాటలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో అప్పటికే ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది తెలంగాణ వాదులు మైనార్టీలో పడిపోయారు. వారంతా చేసేదేమీ లేక ఆంధ్రా వలస నేతల పెత్తనంలో కొనసాగుతున్నారు. అన్ని చోట్లా వారిదే పెత్తనం.. అశ్వారావుపేట మండలంలో ‘ ఆ నలుగురు’గా చెప్పుకునే ‘దేశం’ బహిష్కృత నేతలు, ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే ప్రస్తుతం టీఆర్ఎస్కు ప్రధాన నాయకులయ్యారు. జలగం వెంట ఆయన అనుచరుడైన ఓ యువ నాయకులు టీఆర్ఎస్లో చేరినప్పటికీ ఉనికి కోల్పోతాననే ఆందోళన వ్యక్తం చేయడంతో మిగిలిన నాయకులు వెనుకడుగులు వేసే పనిలో ఉన్నారు. దీంతో దమ్మపేట మండలంలో జలగం అనుచరులుగా పేరున్న పలువురు చివరకు పాత పార్టీల్లోనే కొనసాగుతుండగా మరికొందరు కొత్తగూడెంలో జలగంకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ములకలపల్లి మండలానికి సంబంధించి ప్రచారం, ఇతర ఆర్థికలావాదేవీలు జలగం అనుచరుడిగా పేరున్న దమ్మపేట మండలం పట్వారీగూడేనికి చెందిన మద్యం వ్యాపారి ఒకరు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా బహిష్కృత నేతలే ఈ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తూ తెరవెనుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల్లో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా చివరకు డమ్మీలుగా మిగిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు తెలంగాణ పార్టీ, పెత్తనం మాత్రం అంతా ఆంధ్రా వాళ్లదేనంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు, టీఆర్ఎస్ సానుభూతిపరులు చివరకు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.