అమెరికాలో 40 శాతం ఊబకాయులు
న్యూయార్క్: అమెరికాలో ఊబకాయుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మగవాళ్లలో ఊబకాయుల సంఖ్య నిలకడగా కొనసాగుతుండగా, మహిళల్లో రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. 2013–2014 సంవత్సరాల మధ్య పురుషుల్లో ఊబకాయుల సంఖ్య దేశ జనాభాలో 35 శాతం ఉండగా, మహిళల్లో 40 శాతం ఉన్నట్లు జమా పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 2005 నుంచి 2014 మధ్యకాలంలోనే మహిళల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
12 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో గత 25 ఏళ్ల కాలంలో ఊబకాయ సమస్య స్వల్పంగా పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు. రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య తగ్గిందని, ఆరు నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల్లో సమస్య నిలకడగా ఉందని వారు చెప్పారు. మూడు దశాబ్దాలుగా అమెరికాను వేధిస్తున్న ఈ ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనలు, మెడికల్ కేర్ కోసం అమెరికా ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టింది.
2005 నుంచి 2012 మధ్యకాలంలో 21,013 మందిని చేసిన ఇంటర్వ్యూలను అధ్యయనం చేయడం, 2013–14 సంవత్సరాల మధ్య 2,638 మంది మగవాళ్లను, 2,817 మంది మహిళలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ‘నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటటిక్స్, సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’కు చెందిన నిపుణులు ఈ వివరాలను సేకరించారు.