ఆదివారం మెగా బ్లాక్
సాక్షి, ముంబై: సెంట్రల్, హర్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమత్తులు చేపడతారు. ఫలితంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రజాసంబంధాల అధికారులు తెలిపారు.
సెంట్రల్మార్గంలో...
విద్యావిహార్-బైకలా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ లైన్లో వెళ్లే లోకల్ రైళ్లను ఘాట్కోపర్ తర్వాత ఫాస్ట్ లైన్ పైకి మళ్లిస్తారు. బైకలా వరకు ఫాస్ట్ లైన్లో నడిచి ఆ తర్వాత స్లో ట్రాక్‌లో నడుస్తుంది. ఈ క్రమంలో రైళ్లు కుర్లా, సైన్, మాతుంగా, దాదర్, పరేల్ స్టేషన్లలో నిలుపుతారు. విద్యావిహార్, కర్రీరోడ్, చించ్‌పోక్లీ స్టేషన్లలో రైళ్లు నిలపరు. ప్రయాణికులు కుర్లా, బైకలాలో దిగి ఎదురు దిశగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అధికారులు అనుమతించారు. అదేవిధంగా అప్, డౌన్ ఫాస్ట్ లైన్లో నడిచే రైళ్లు మెగాబ్లాక్ సమయంలో ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములూండ్ స్టేషన్లలో నిలుపుతారు. కొన్ని రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి.
హార్బర్ మార్గంలో...
హర్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి బాంద్రా-అంధేరీల మధ్య నడిచే లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. బాంద్రా-అంధేరిలకు వెళ్లే ప్రయాణికులు మెయిన్, లేదా పశ్చిమ మార్గంలో ప్రయాణించవచ్చని అధికారులు అనుమతించారు. అలాగే డౌన్ లైన్లో సీఎస్టీ నుంచి పన్వెల్-బేలాపూర్-వాషిలకు నడిచే రైళ్లను కుర్లా వరకు మెయిన్ లైన్‌పై నడుపుతారు. ఈ రైళ్లు చించ్‌పోక్లీ, కర్రీరోడ్ స్టేషన్లలో నిలపరని అధికారులు తెలిపారు.
పశ్చిమ మార్గంలో జంబో బ్లాక్
పశ్చిమ రైల్వే మార్గంలో ఆదివారం జంబో బ్లాక్ నిర్వహించనున్నారు. బోరివలి-గోరేగావ్ స్టేషన్ల మధ్య స్లో లైన్లో ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు ట్రాక్, సిగ్నల్, ఓవర్‌హెడ్ వైర్ల నిర్వహణ, మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ కారణంగా బోరివలి-గోరేగావ్ స్టేషన్ల మధ్య స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లంటినీ ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జంబో బ్లాక్ సందర్భంగా కొన్ని రైళ్లను రద్దు చేయనున్నామని అధికారులు తెలిపారు.