మీ జీవితం ఓ పాఠం...
పూర్తి పేరు: జేమ్స్ క్లీవ్‌లాండ్ ఓవెన్స్
జననం: సెప్టెంబర్ 12, 1913
విభాగం: ట్రాక్ మరియు ఫీల్డ్
ఒలింపిక్స్ స్వర్ణాలు: 4 (1936)
మరణం: మార్చి 31, 1980
జెస్సీ ఓవెన్స్... అథ్లెటిక్స్ దిగ్గజం... అంతేనా..!
అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన అమెరికా క్రీడాకారుడిగానే గుర్తుంచుకోవాలా..!
కాదు... జాత్యహంకారానికి క్రీడల ద్వారా సమాధానం చెప్పిన ఘనుడు...
హిట్లర్‌కే ఎదురు నిలిచి నల్లజాతి తెగువను ప్రపంచానికి చాటిన యోధుడు...
అది 1936వ సంవత్సరం. బెర్లిన్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. తమ దేశ ఆటగాళ్లకు కాకుండా ఇతరులకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా హిట్లర్ ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో 100మీ. రేసును ఓవెన్స్ 10.3 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఓవెన్స్‌ను ఎక్కడ అభినందించాల్సి వస్తుందో అని ఆ నియంత అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో 8 మీటర్లు దుమికి మరో స్వర్ణం, 200మీ. పరుగును 20.7 సెకన్లలో పూర్తి చేసి మూడో స్వర్ణం, 4ఁ100మీ.
రిలేలోనూ ఇదే ప్రతిభ చూపి నాలుగు స్వర్ణాలతో చరిత్ర సృష్టించి హిట్లర్ అవాక్కయ్యేలా చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగిన ఓవెన్స్ సాధించిన ఈ చరిత్రాత్మక విజయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నల్లజాతీయులంతా ఓవెన్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ స్వర్ణాలను ఒలింపిక్స్ వారసత్వ సంపదగా పరిగణిస్తారు. అందుకే గత నెలలో జరిగిన వేలంలో ఓవెన్స్ సాధించిన ఓ స్వర్ణానికి రూ. 9 కోట్ల ధర పలికింది.