మళ్లీ సింగిల్ టెండర్
జమ్మికుంట :జమ్మికుంట నగర పంచాయతీ అంటేనే సింగిల్ టెండర్ అన్నట్లుగా మారింది పరిస్థితి. అంతా ముందే సిద్ధం చేసుకున్నట్లుగా చాలా పనులకు ఆన్లైన్లో సింగిల్ టెండర్లు దాఖలు కావడం.. మొదట తిరస్కరించిన కౌన్సిల్ ఆనక ఆమోదం తెలపడం... అనేక విమర్శలు వస్తున్నా... తాజాగా వచ్చిన ఏడు పనులకు సైతం సింగిల్ టెండర్లే దాఖలు కావడం విస్మయపరుస్తోంది.
జమ్మికుంట నగర పంచాయతీలో ప్లాన్ గ్రాంట్ నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత నెలలో రూ.1.77 కోట్లతో 28 పనులకు ఆన్లైన్ టెండర్లు పిలవగా అన్నీ సింగిల్ టెండర్లే రావడం, 0.01 నుంచి 0.75 శాతం లెస్‌కు దాఖలయ్యాయి. కాంట్రాక్టర్లు రింగై సింగిల్ టెండర్లు దాఖలు చేశారనే కథనాలు పత్రికల్లో రావడంతో అధికారులు వాటిని రద్దు చేశారు. అప్పటి 28 పనులతోపాటు మరికొన్నింటిని కలిపి మొత్తం 67 పనులకు రూ.3 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో ఈ నెల 6న టెండర్లు పిలిచారు. 10వ తేదీ వరకు గడువు విధించారు. వీటిలో 48 పనులకు సింగిల్ టెండర్లే దాఖలు కాగా, రెండు 4.90 శాతం ఎక్సెస్‌తో దాఖలయ్యాయి. ఐదు టెండర్లు సాంకేతిక లోపంతో తెరుచుకోలేదు. ఎక్సెస్ టెండర్లతోపాటు తెరుచుకోని ఐదింటిని మినహాయించి మిగతావాటికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఏడు పనులకు ఈ నెల 24న రూ.45 లక్షల అంచనా వ్యయంతో మళ్లీ టెండర్లు పిలిచారు. 28 వరకు గడువు ఇవ్వగా బుధవారం వచ్చిన ఆన్లైన్ బిడ్లను అధికారులు తెరిచినట్లు సమాచారం. ఏడు పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యాయి. ప్రతీ పనికి 0.20, 0.40, 1.40, 1.80 , 1.10, 1.50 శాతం లెస్ కోట్తో టెండర్లు వచ్చినట్లు తెలిసింది.
మొన్న ఎక్సెస్... నేడు లెస్
సీసీ రోడ్డు పనుల కోసం రూ.19 లక్షల వ్యయంతో పిలిచిన రెండు టెండర్లకు గతంలో 4.90 శాతం ఎక్సెస్‌తో దాఖలయ్యాయి. ఎక్సెస్‌పై అనుమతి కోసం అధికారులు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు సమర్పించగా... ఎక్సెస్ కావడం... అదీ సింగిల్ టెండర్ రావడంతో అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పనులకు మళ్లీ టెండర్లు పిలవగా బుధవారం తెరిచిన బిడ్లలో ఈ పనులకు 1.40 శాతం లెస్తో టెండర్ దాఖలైనట్లు తెలిసింది. టెండర్లు మళ్లీ పిలవడంతో నగర పంచాయతీ ఖజానాకు రూ.30 వేల దాకా ప్రయోజనం చేకూరినట్లయిందనే చర్చ జరుగుతోంది. 48 పనులకు సింగిల్ టెండర్లు వచ్చినా గత సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తెలపగా, ఈ ఏడు టెండర్లను సైతం ఆమోదించేందుకు నగరపంచాయతీ కౌన్సిల్లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. పట్టణంలో 20 వార్డుల్లో ఏకకాలంలో సీసీ రోడ్లు, మురికికాలువ పనులు సాగేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. సింగల్ టెండర్లు రావడం... అదికూడా స్థానికులే పనులు దక్కించుకోవడం... ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ టెండర్లలో పోటీ పడకపోవడం... ఆన్లైన్ విధానంలో మతలబు ఏంటో? ఎవరికీ అంతుచిక్కడం లేదు.